Drug Control Organisation: 11 మంది చిన్నారుల మృతి... ఆ దగ్గుమందులో కలుషిత ఆనవాళ్లు లేవన్న ఔషధ నియంత్రణ సంస్థ

Drug Control Organisation says no contamination found in cough syrup
  • పెద్దలకు వాడే దగ్గు సిరప్ తాగి 11 మంది చిన్నారులు మృతి
  • పరీక్షల్లో ఎలాంటి కలుషిత ఆనవాళ్లు లేవన్న ఔషధ నియంత్రణ సంస్థ
  • ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడి
పిల్లలకు ఇచ్చిన దగ్గు మందులో ఎటువంటి కలుషిత ఆనవాళ్లు లేవని ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పెద్దలకు వాడే దగ్గు సిరప్‌ను ఇవ్వడంతో 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి కలుషిత ఆనవాళ్లు గుర్తించలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరిక్ దగ్గు సిరప్‌ను సరఫరా చేస్తారని, దానిపై తాము తాజాగా పరీక్షలు నిర్వహించామని తెలిపాయి.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ సిరప్‌ను జైపూర్‌కు చెందిన కేసన్స్ అనే ఔషధ సంస్థ తయారు చేస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. గత రెండేళ్లుగా ఈ సిరప్‌కు చేసిన నాణ్యతా పరీక్షల్లో 40 నమూనాలు విఫలమైనట్లు గుర్తించిన అధికారులు తాత్కాలికంగా నిషేధం విధించారు.

కేసన్స్ ఇప్పటి వరకు 660 బాటిళ్లను తయారు చేయగా 594 బాటిళ్లను వివిధ దుకాణాలకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. సంస్థలో ఉన్న 66 బాటిల్ శాంపిల్స్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో ఈ సిరప్‌ను విక్రయించవద్దని దుకాణదారులకు అధికారులు సూచించారు.

అనారోగ్యానికి గురైన వైద్యుడు

కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న పిల్లలు ఈ సిరప్‌ను తీసుకోవడం వల్ల మరింత ప్రభావం పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సిరప్ సురక్షితమని నిరూపించడానికి దానిని సేవించిన భరత్‌పుర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఒక వైద్యుడు కూడా అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు.
Drug Control Organisation
cough syrup
children deaths
Rajasthan
Madhya Pradesh
Kesons Pharmaceuticals

More Telugu News