Chandrababu Naidu: భారీ వర్షాల మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu announces ex gratia for rain victims
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలకు నలుగురు మృతి
  • సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష 
  • మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం
  • ఒడిశా వర్షాలతో వంశధార నదికి భారీగా వరద ప్రవాహం
  • ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని అధికారులకు సీఎం హెచ్చరిక
ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆదేశించారు.

విశాఖపట్నం నగరంలోని కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో మరొకరు వర్షాల కారణంగా మృతి చెందినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఉత్తరాంధ్రలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఎగువన ఉన్న ఒడిశా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా నదులకు వరద పోటెత్తుతోంది. వంశధార నదిలోకి 1.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, గొట్టా బ్యారేజీకి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లి బ్యారేజీకి 44 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని శ్రీకాకుళం కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వర్షాల వల్ల విరిగిపడిన చెట్లలో 90 శాతం వరకు తొలగించి, రహదారులను పునరుద్ధరించినట్లు చెప్పారు. అదేవిధంగా, ప్రభావిత జిల్లాల్లో 90 శాతం విద్యుత్ సరఫరాను తిరిగి అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్లు నివేదించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని ముఖ్యమంత్రి అధికారులను గట్టిగా హెచ్చరించారు.
Chandrababu Naidu
Andhra Pradesh floods
heavy rains
ex gratia
Uttarandhra districts
Srikakulam
Visakhapatnam
Parvathipuram Manyam district
flood relief
Vamsadhara river

More Telugu News