Inter Student Suicide: పెదనాన్న వేధింపులే ప్రాణం తీశాయి.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad Inter Student Suicide Allegedly Due to Uncles Harassment
  • కొంపల్లిలో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
  • పెదనాన్న లైంగిక వేధింపులే కారణమని ఆరోపణ
  • అప్పు విషయం మాట్లాడే నెపంతో అసభ్య ప్రవర్తన
  • ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌
  • మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన పెదనాన్న నుంచే లైంగిక వేధింపులు ఎదురుకావడంతో వాటిని భరించలేని ఓ 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన పోచమ్మగడ్డ ప్రాంతంలో గురువారం రాత్రి జ‌రిగింది.

పేట్ బషీరాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిజామాబాద్ జిల్లా వర్నికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం కొంపల్లికి వలస వచ్చి నివసిస్తోంది. ఈ దంపతుల పెద్ద కుమార్తె (17) స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ‌ సంవత్సరం చదువుతోంది. గతేడాది రోడ్డు ప్రమాదంలో బాలిక తండ్రి మరణించారు. ఆయన బతికున్నప్పుడు తన అన్నతో కలిసి మేడ్చల్‌లో ఫైనాన్స్‌లో కొంత రుణం తీసుకున్నారు.

తండ్రి మరణం తర్వాత, ఆ అప్పు విషయం మాట్లాడాలనే నెపంతో పెదనాన్న తరచూ తమ్ముడి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను లైంగికంగా వేధించేవాడు. అతని వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో ఆ బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ నరకాన్ని భరించలేక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

విషయం తెలుసుకున్న బాలిక తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నట్లు వారు వెల్లడించారు. 
Inter Student Suicide
Hyderabad
Sexual Harassment
Pochammagadda
Nizamabad
Pet Basheerabad Police
Komapally
Student Commits Suicide

More Telugu News