IRS Officer: తెనాలిలో పెళ్లి వేడుకలో భారీ దోపిడీ.. ఐఆర్‌ఎస్‌ అధికారి కారు అద్దం పగలగొట్టి రూ.15 లక్షల సొత్తు చోరీ

IRS Officers Car Robbed of 15 Lakh in Tenali Wedding Theft
  • రూ.5 లక్షల నగదు, రూ.10 లక్షల బంగారం అపహరణ
  • కొల్లిపర మండలంలోని ఇంట్లో మరో దొంగతనం
  • తాళాలు విరగ్గొట్టి రూ.10 లక్షల విలువైన ఆభరణాల లూటీ
  • రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఘటనల్లో లక్షల రూపాయల విలువైన సొత్తును అపహరించుకుపోయారు. తెనాలిలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఐఆర్‌ఎస్‌ అధికారి కారులో భారీ చోరీ జరగడం కలకలం రేపింది.

తెలంగాణకు చెందిన ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి గురువారం రాత్రి తెనాలి చెంచుపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న పెళ్లికి హాజరయ్యారు. వేడుక ముగిశాక తిరుగు ప్రయాణం కోసం పార్కింగ్ స్థలంలో ఉన్న తన కారు వద్దకు వెళ్లగా, కారు అద్దం పగిలి ఉండటం చూసి నివ్వెరపోయారు. లోపల పరిశీలించగా, కారులో ఉంచిన బ్యాగ్ కనిపించలేదు. ఆ బ్యాగులో రూ.5 లక్షల నగదు, సుమారు రూ.10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, మూడు ఐఫోన్‌లు, పాస్‌పోర్ట్, క్రెడిట్ కార్డులు ఉన్నట్లు బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై ఆయన వెంటనే తెనాలి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదే తరహాలో జిల్లాలోని కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో మరో చోరీ జరిగింది. స్థానికంగా నివసించే మోటూరు మధుసూదనరావు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి, అందులో ఉన్న దాదాపు రూ.10 లక్షల విలువైన బంగారు నగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కొల్లిపర పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు రెండు ఘటనలపైనా దర్యాప్తు ప్రారంభించి, నిందితుల కోసం గాలిస్తున్నారు.
IRS Officer
Tenali theft
Guntur crime
Andhra Pradesh robbery
Gold jewelry theft
Car break-in
Tenali wedding theft
Kollipera robbery
Cash theft
iPhone theft

More Telugu News