Ambedkar Statue Desecration: అంబేద్కర్ విగ్రహానికి అవమానం.. సీఎం చంద్రబాబు సీరియస్

Ambedkar Statue Desecrated Chandrababu Naidu Orders Strict Action
  • చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు
  • విగ్రహం పక్కనున్న షెడ్డుకు మంట పెట్టడంతో ఘటన
  • గ్రామంలో ఉద్రిక్తత, దళిత సంఘాల నిరసన
  • ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. దోషులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే... దేవళంపేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆనుకుని ఉన్న ఓ షెడ్డుకు కొందరు ఆగంతుకులు గురువారం రాత్రి నిప్పు పెట్టారు. ఈ మంటలు క్రమంగా విగ్రహానికి వ్యాపించడంతో విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జాతీయ నాయకుల విగ్రహాలకు అవమానం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు దేవళంపేట గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Ambedkar Statue Desecration
Ambedkar
Chittoor district
Vudurukuppam
Chandrababu Naidu
Andhra Pradesh
Dalit
crime
police investigation

More Telugu News