Chaithanyananda Saraswati: స్వామీజీ సెక్స్ స్కామ్‌లో కీలక మలుపు.. ముగ్గురు మహిళా అధికారుల అరెస్ట్!

Chaithanyananda Saraswati Sex Scandal Key Twist 3 Women Officers Arrested
  • అరెస్టయిన వారిలో కాలేజీ అసోసియేట్ డీన్, డైరెక్టర్, ఫ్యాకల్టీ
  • స్వామీజీ ఆదేశాలతో విద్యార్థినులపై ఒత్తిడి తెచ్చినట్లు అంగీకారం
  • ఫిర్యాదుదారులను బెదిరించి, సాక్ష్యాలను నాశనం చేసినట్లు ఆరోపణలు
  • ఇప్పటికే రూ.20 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలు
  • నిందితుడిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని తెలిపిన పోలీసులు
విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టయిన స్వయం ప్రకటిత స్వామీజీ చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. స్వామీజీకి నేరుగా సహకరించారన్న ఆరోపణలపై అతడి ముగ్గురు అత్యంత సన్నిహితురాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్-రీసెర్చ్‌కు చెందిన అసోసియేట్ డీన్ శ్వేతా శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భావనా కపిల్, సీనియర్ ఫ్యాకల్టీ కాజల్ ఉన్నారు.

ఈ ముగ్గురూ పార్థసారథి ఆదేశాల మేరకే నడుచుకున్నట్లు విచారణలో అంగీకరించారని పోలీసు వర్గాలు తెలిపాయి. క్రమశిక్షణ, సమయపాలన పేరుతో విద్యార్థినులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి, స్వామీజీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నించారని వెల్లడించాయి. అంతేకాకుండా, బాధితులు ఫిర్యాదు చేయకుండా బెదిరించడం, నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేయడంలోనూ వీరి పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు.

ఇటీవలే ఆగ్రాలో పట్టుబడిన 62 ఏళ్ల పార్థసారథి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల స్కాలర్‌షిప్ పథకం కింద మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరిన 17 మందికి పైగా విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, బలవంతంగా తాకడం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఫిర్యాదులు అందాయి. దర్యాప్తులో భాగంగా ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఉన్న ఒక గెస్ట్ హౌస్‌ను పోలీసులు పరిశీలించగా, అక్కడ పార్థసారథి విద్యార్థినులతో బస చేసినట్లు స్థానికులు ధ్రువీకరించారు.

నిందితుడి ఫోన్‌లోని డిజిటల్ సాక్ష్యాలను కూడా పోలీసులు సేకరించారు. ఒక యోగా వాట్సాప్ గ్రూపులో విద్యార్థినుల ఫొటోలకు అతడు పెట్టిన అనుచిత వ్యాఖ్యలను గుర్తించారు. ఇన్ని ఆధారాలు దొరికినా, పార్థసారథిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని విచారణ వర్గాలు పేర్కొన్నాయి.

 మరోవైపు, ఈ కేసులో ఆర్థిక కోణం కూడా బయటపడింది. ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా అతడిని నియమించిన శ్రీ శృంగేరి మఠం, అతడితో సంబంధాలు తెంచుకుంది. సుమారు రూ. 20 కోట్ల నిధులను దుర్వినియోగం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. పార్థసారథి వేరే పేరుతో నకిలీ పాస్‌పోర్ట్ కూడా పొందినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇనిస్టిట్యూట్‌లోని ఎలక్ట్రానిక్ పరికరాలు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Chaithanyananda Saraswati
Swami sex scandal
Delhi Police
Shweta Sharma
Bhavana Kapil
Kajal
sexual harassment case
Sri Sharada Institute
financial irregularities
fake passport

More Telugu News