Pakistan Government: డిజిటల్ టెక్నాలజీతో సొంత ప్రజలపైనే పాకిస్థాన్ నిఘా!

Pakistan Government uses digital tech to spy on citizens
  • పాకిస్థాన్‌లో 40 లక్షల మంది పౌరులపై ప్రభుత్వ నిఘా
  • చైనా, జర్మనీ కంపెనీల నుంచి అధునాతన టెక్నాలజీ కొనుగోలు
  • భద్రత పేరుతో అసమ్మతిని అణచివేసేందుకేనని ఆరోపణలు
  • ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ వాడకంపై నిరంతర గూఢచర్యం
  • ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులే ప్రధాన లక్ష్యమన్న నివేదికలు
  • సోషల్ మీడియాపై నిషేధం, వీపీఎన్‌లపై కఠిన ఆంక్షలు
పాకిస్థాన్ ప్రభుత్వం తమ దేశంలోని 40 లక్షల మందికి పైగా పౌరుల ప్రతి కదలికపై నిఘా పెట్టింది. ఇందుకోసం చైనా వంటి దేశాల్లోని ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన అత్యంత అధునాతన డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తోంది. ప్రభుత్వ చర్యలపై గొంతెత్తే వారిని, అసమ్మతి స్వరాలను అణచివేయడమే లక్ష్యంగా ఈ భారీ గూఢచర్య కార్యక్రమం కొనసాగుతోందని 'అమ్నెస్టీ ఇంటర్నేషనల్' తాజాగా విడుదల చేసిన నివేదిక సంచలనం సృష్టిస్తోంది.

'నియంత్రణ నీడ: పాకిస్థాన్‌లో సెన్సార్‌షిప్, సామూహిక నిఘా' పేరుతో విడుదలైన ఈ నివేదిక ప్రకారం, పాక్ ప్రభుత్వం రెండు కీలక వ్యవస్థలను నిఘా కోసం వాడుతోంది. మొదటిది, వెబ్ మానిటరింగ్ సిస్టమ్ (డబ్ల్యూఎంఎస్ 2.0). ఇది ఒక జాతీయ ఫైర్‌వాల్‌గా పనిచేస్తూ ఇంటర్నెట్‌ను, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (వీపీఎన్), ప్రభుత్వానికి నచ్చని వెబ్‌సైట్‌లను బ్లాక్ చేస్తుంది. రెండవది, లాఫుల్ ఇంటర్‌సెప్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్ఐఎంఎస్). దీని ద్వారా అధికారులు ప్రజల ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు, ఇంటర్నెట్ కార్యకలాపాలు, చివరకు వారి లొకేషన్ వివరాలను కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఈ టెక్నాలజీని జర్మనీకి చెందిన యుటిమాకో, యూఏఈకి చెందిన డేటాఫ్యూజన్ అనే కంపెనీలు అందిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

దేశ భద్రత, నైతిక విలువల పరిరక్షణ పేరుతో ప్రభుత్వం ఈ చర్యలను సమర్థించుకుంటున్నప్పటికీ, దీని అసలు ఉద్దేశం ప్రతిపక్షాలను, ప్రభుత్వాన్ని విమర్శించేవారిని లక్ష్యంగా చేసుకోవడమేనని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులే ఈ నిఘాలో ప్రధాన లక్ష్యంగా ఉన్నారని తెలుస్తోంది. అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నేతల వ్యక్తిగత ఆడియో, వీడియోలను లీక్ చేసి వారిని రాజకీయంగా బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ (పీటీఐ) మద్దతుదారులు నిరసనలకు పిలుపునివ్వడంతో ‘ఎక్స్’ ను ప్రభుత్వం నిషేధించింది. ప్రజలు వీపీఎన్‌ల ద్వారా దాన్ని వాడటం మొదలుపెట్టడంతో, వాటిపై కూడా ఉక్కుపాదం మోపింది. వీపీఎన్‌ల వాడకం ఇస్లాం విరుద్ధమని అక్కడి కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ ప్రకటించడం గమనార్హం.

డిజిటల్ రైట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిఘాత్ దాద్ మాట్లాడుతూ, "పాకిస్థాన్‌లో బలమైన డేటా రక్షణ చట్టం లేకపోవడం వల్ల పౌరులు నిరంతర వేధింపులకు గురవుతున్నారు" అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిఘా చట్టవిరుద్ధమని 1997లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, దాన్ని బేఖాతరు చేస్తూ ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. "ఈ అక్రమ నిఘాను అడ్డుకోవడంలో న్యాయవ్యవస్థ, పార్లమెంట్ వంటి సంస్థలు కూడా విఫలమయ్యాయి" అని బోలో భీ డైరెక్టర్ ఉసామా ఖిల్జీ విమర్శించారు.
Pakistan Government
digital surveillance
Amnesty International
web monitoring system
lawful intercept management system
Imran Khan
digital rights foundation
social media censorship
VPN ban
Utimaco

More Telugu News