Chandrababu Naidu: ఉత్తరాంధ్రకు వాయు'గండం'... సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష

Chandrababu Reviews Uttarandhra Cyclone Situation
  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • ఉత్తరాంధ్రకు అతి భారీ వర్ష సూచన... మూడు జిల్లాలకు వరద ముప్పు
  • ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మూడు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమీక్ష చేపట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. అధికారులను అడిగి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కంట్రోల్ రూమ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. 

పరిస్థితిని ఎదుర్కొనేందుకు టీమ్ లు సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. మంత్రులు, విపత్తు బృందాలు పరిస్థితులను పరిశీలించాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
Uttarandhra
Cyclone Alert
Heavy Rains
Weather Forecast
Emergency Review
Flood Warning
CM Review
Disaster Management

More Telugu News