Bay of Bengal Cyclone: ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు

Bay of Bengal Cyclone Threatens North Andhra with Flash Floods
  • వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
  • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు రెడ్ అలెర్ట్
  • విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
  • తీరం వెంబడి బలమైన గాలులు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ సూచన 
  • అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర కోస్తాంధ్ర వైపు వేగంగా కదులుతుండటంతో రానున్న 24 గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా ఉందని, ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి నాగభూషణం తెలిపారు. ఈ వాయుగుండం ఇవాళ అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయం గోపాల్‌పూర్ - పారాదీప్ మధ్య తీరం దాటవచ్చని ఆయన అంచనా వేశారు. దీని కారణంగా ఉత్తర కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం పడనుంది.

ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి ఆకస్మిక వరదలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. 

మరోవైపు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక్కడ 5 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, కోనసీమ, యానాం ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ కొనసాగుతోంది.

తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అందువల్ల మత్స్యకారులు మూడు రోజుల పాటు వేటకు వెళ్లరాదని కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. కోస్తా తీరంలోని అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసి అప్రమత్తం చేశారు. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు తరలించింది.
Bay of Bengal Cyclone
Andhra Pradesh Floods
North Coastal Andhra
Srikakulam
Vizianagaram
Parvathipuram Manyam district
IMD
Weather forecast
red alert

More Telugu News