Rajnath Singh: సర్ క్రీక్ వద్ద తోక జాడిస్తే తాట తీస్తాం: పాకిస్థాన్ కు రాజ్ నాథ్ వార్నింగ్

Rajnath Singh Warns Pakistan on Sir Creek Aggression
  • సర్ క్రీక్ విషయంలో పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరిక
  • కరాచీకి వెళ్లే దారి సర్ క్రీక్ నుంచేనని కీలక వ్యాఖ్యలు
  • భుజ్ ఎయిర్ బేస్‌లో విజయదశమి సందర్భంగా శస్త్ర పూజ నిర్వహణ
  • 'ఆపరేషన్ సిందూర్' విజయాన్ని గుర్తు చేసిన రాజ్‌నాథ్
  • సర్ క్రీక్ వద్ద పాక్ సైనిక నిర్మాణాలు పెంచడంపై ఆగ్రహం
సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా, చరిత్రతో పాటు భౌగోళికంగా రూపురేఖలు మారిపోయేలా గట్టి సమాధానం ఇస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గురువారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని భుజ్ ఎయిర్ బేస్‌లో నిర్వహించిన శస్త్ర పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాకిస్థాన్‌కు స్పష్టమైన సందేశం పంపారు.

1965 యుద్ధంలో భారత సైన్యం లాహోర్ వరకు వెళ్లగలిగే సత్తా చూపించిందని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. "కరాచీకి వెళ్లే ఒక మార్గం సర్ క్రీక్ గుండానే వెళుతుందనే విషయాన్ని పాకిస్థాన్ ఇప్పుడు గుర్తుంచుకోవాలి" అని ఆయన అన్నారు. ఇటీవలే జరిగిన 'ఆపరేషన్ సిందూర్' గురించి ప్రస్తావిస్తూ, లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు భారత రక్షణ వ్యవస్థలను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ విఫలయత్నం చేసిందని తెలిపారు. "మన బలగాలు జరిపిన ప్రతిదాడిలో పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా బట్టబయలైంది. భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా కావాలంటే అప్పుడు పాకిస్థాన్‌కు భారీ నష్టాన్ని కలిగించగలదని 'ఆపరేషన్ సిందూర్' ప్రపంచానికి స్పష్టం చేసింది" అని ఆయన ఉద్ఘాటించారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 78 ఏళ్లుగా సర్ క్రీక్ వివాదం కొనసాగుతోందని, చర్చల ద్వారా పరిష్కారానికి భారత్ ఎప్పుడూ ప్రయత్నిస్తోందని, కానీ పాకిస్థాన్ ఉద్దేశాలు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నాయని రాజ్‌నాథ్ అన్నారు. సర్ క్రీక్ సమీపంలో పాకిస్థాన్ ఇటీవల సైనిక మౌలిక సదుపాయాలను పెంచుతుండటమే వారి దుష్ట పన్నాగాలకు నిదర్శనమని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా ఊహించని రీతిలో బదులిస్తామని స్పష్టం చేశారు.

ఇదే రోజు మహాత్మా గాంధీ జయంతి కావడంతో ఆయనను స్మరించుకున్నారు. "ఆయుధాలు లేకుండానే అత్యున్నత నైతిక స్థైర్యానికి గాంధీజీ ప్రతీక. మన సైనికులకు నైతిక స్థైర్యంతో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయి. వారిని ఏ శక్తీ ఎదుర్కోలేదు," అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. విజయదశమి నాడు శస్త్ర పూజ చేయడం మన సన్నద్ధతకు, సైనికుల పట్ల గౌరవానికి ప్రతీక అని ఆయన వివరించారు. 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం చేసిన త్రివిధ దళాల సైనికులు, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.
Rajnath Singh
Sir Creek
Pakistan
India Pakistan border
Operation Sindoor
Gujarat
Bhuj Air Base
defense minister India
military
Kutch

More Telugu News