Pawan Kalyan: విజయ్‌ను మించిన హార్డ్ వర్కర్ పవన్ కల్యాణ్.. ఓజీ కెమెరామెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan More Hardworking Than Vijay Says OG Cinematographer
  • విజయ్ కన్నా పవన్ కల్యాణే ఎక్కువ కష్టపడతారని ఓజీ కెమెరామెన్ ప్రశంస
  • ‘ఓజీ’ కోసం పవన్ 16 రోజుల పాటు అద్భుతమైన డెడికేషన్ చూపించారన్న మనోజ్
  • యాక్షన్ సీన్లు, ఎమోషన్స్, అధికారిక పనులను పవన్ బ్యాలెన్స్ చేశారని వెల్లడి
  • పవన్ పనితనం చూసి తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలిపిన సినిమాటోగ్రాఫర్
  • దర్శకుడు సుజీత్ పక్కా ప్లానింగ్‌పై కూడా మనోజ్ పరమహంస ప్రశంసల వర్షం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'ఓజీ’. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ అందుకుంది. గతరాత్రి ఈ చిత్రం విజయోత్సవ సభ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో, ఓజీ కోసం పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తాను తమిళ స్టార్ హీరో విజయ్‌ను అత్యంత కష్టపడి పనిచేసే హీరోగా భావించేవాడినని, కానీ ‘ఓజీ’ కోసం పవన్ కల్యాణ్ ఆయన్ను మించిపోయారని అన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.

‘ఓజీ’ చిత్రానికి ఇద్దరు సినిమాటోగ్రాఫర్లలో ఒకరిగా పనిచేసిన మనోజ్, తన షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. పవన్ కల్యాణ్‌తో పనిచేసిన 16 రోజులు ఒక రోలర్ కోస్టర్ ప్రయాణంలా సాగాయని తెలిపారు. "పవన్ సర్‌తో గతంలో పనిచేసినప్పటికీ, ఓజీలో ఆయన విశ్వరూపం చూశాను. వరుసగా యాక్షన్ ఘట్టాలు, భావోద్వేగ సన్నివేశాలు, మాస్ ఎలివేషన్ సీన్లు చేస్తూనే.. మరోవైపు అధికారిక పనుల కోసం చిన్న విమాన ప్రయాణాలు చేసేవారు. ఒక చేతిలో కత్తి, రక్తంతో సెట్ లోనే అధికారిక పత్రాలపై సంతకాలు చేస్తూనే, జపనీస్ డైలాగులు నేర్చుకోవడం చూశాను. ఎవరికైనా ఇది చాలా కష్టమైన పని, కానీ మీరు ఎంతో పట్టుదలతో, తేలికగా పూర్తి చేశారు. సినిమా పట్ల మీకున్న అభిరుచికి ఇది నిదర్శనం" అని మనోజ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

విజయ్‌తో పవన్‌ను పోలుస్తూ, "ఇప్పటివరకు విజయ్ సార్ అత్యంత కష్టపడి పనిచేసే స్టార్ హీరో అని నేను అనుకునేవాడిని. కానీ ‘ఓజీ’ కోసం మీరు ఒక అడుగు ముందుకేశారు. మీ సమయాన్ని నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సినిమాకు అతీతంగా, పాలనపై ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని, సమయాన్ని మీరు బ్యాలెన్స్ చేసే విధానంపై నాకు గౌరవం ఉంది" అని పేర్కొన్నారు.

అదేవిధంగా దర్శకుడు సుజీత్‌పై కూడా మనోజ్ ప్రశంసలు కురిపించారు. "ఒక సినిమా అద్భుతంగా కనిపిస్తుందంటే ఆ ఘనత దర్శకుడిదే. కేవలం 16 రోజుల హీరో షెడ్యూల్ కోసం సుజీత్ ఆరు నెలలకు పైగా సిద్ధమయ్యారు. ఆయన పట్టుదల, ప్రణాళిక అమోఘం. అందుకే ఇంత మంచి అవుట్‌పుట్ వచ్చింది" అని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pawan Kalyan
OG movie
Vijay Thalapathy
Manoj Paramahamsa
Telugu cinema
Sujith
action movie
Tollywood
cinema photographer

More Telugu News