Rajasthan incident: కారును ఢీకొట్టిందని.. ఎద్దును తొక్కించి చంపేశారు.. వీడియో ఇదిగో!

Bullock Killed in Rajasthan After Car Scratched
  •  రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో అమానవీయ ఘటన
  •  కారును ఢీకొట్టిందన్న కోపంతో ఎద్దుపై కిరాతకం
  •  వెంటాడి, కారుతో తొక్కించి చంపేసిన డ్రైవర్
  •  సోషల్ మీడియాలో వైరల్ అయిన హత్య వీడియో
  •  నిందితులను అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాల ఆందోళన  
కారుకు చిన్న గీత పడిందన్న కోపంతో ఓ ఎద్దును అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ఈ అమానవీయ సంఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి, ఉద్రిక్తతకు దారితీసింది.

స్థానికుల కథనం ప్రకారం ఒక పెళ్లి ఊరేగింపులో భాగంగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ ఎద్దు ఢీకొట్టింది. దీంతో వాహనం ముందు భాగంలో స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన వాహనంలోని వ్యక్తులు ఎద్దును వెంబడించారు. కొంత దూరం తరుముకుంటూ వెళ్లి వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో అది కిందపడిపోయింది. అంతటితో ఆగకుండా, డ్రైవర్ కారును దాని మెడపై నుంచి పోనించి చంపేశాడు.

ఈ దారుణాన్ని చూసిన స్థానికులు.. ఎద్దును చంపవద్దని డ్రైవర్‌ను వేడుకున్నారు. అయినా వారి మాటలను ఏమాత్రం లెక్కచేయకుండా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ మొత్తం ఘటనను కొందరు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఎద్దును చంపిన వెంటనే డ్రైవర్, అతని అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనపై స్థానిక ప్రజలు, గో సంరక్షణ సమితి సభ్యులు, పలువురు సాధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు వారి ఆందోళన కొనసాగింది. నిందితులను అరెస్ట్ చేయకపోతే తమ నిరసనను మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాక్ష్యంగా వైరల్ అవుతున్న వీడియోను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. మరణించిన ఎద్దు కళేబరాన్ని పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.  
Rajasthan incident
Sikar district
bullock killed
road rage
animal cruelty
viral video
police investigation
protest
cow protection committee
crime

More Telugu News