3D printed house: గ్రామీణ గృహ నిర్మాణంలో కొత్త శకం.. దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ గ్రామీణ గృహం ప్రారంభం

Indias First 3D Printed Rural Home Launched by Pemmasani Chandrasekhar
  • ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
  • ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సీబీఆర్‌ఐలో ఈ కార్యక్రమం
  • తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే ఇళ్ల నిర్మాణం
  • పీఎం ఆవాస్ యోజన లక్ష్య సాధనలో కీలక ముందడుగు
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని చంద్రశేఖర్, దేశ గృహ నిర్మాణ రంగంలో ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించిన గ్రామీణ గృహాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్-సీబీఆర్‌ఐ) ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి, ఖర్చు తగ్గించడానికి ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పర్యావరణానికి మేలు చేసేలా, తక్కువ సమయంలోనే నాణ్యమైన ఇళ్లను నిర్మించడం దీని ప్రత్యేకత అని వివరించారు. దేశంలో అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధన దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగని ఆయన పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (పీఎంఏవై-జీ) పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 2.87 కోట్ల ఇళ్లు పూర్తయ్యాయని, మొత్తం 3.85 కోట్ల ఇళ్లు మంజూరు చేశామని గణాంకాలను వెల్లడించారు. ఈ ప్రయాణంలో సీబీఆర్‌ఐ వంటి సంస్థల సాంకేతిక సహకారం ఎంతో విలువైందని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఉత్తరాఖండ్‌లో గ్రామీణ గృహనిర్మాణం’ అనే పుస్తకాన్ని కూడా మంత్రి ఆవిష్కరించారు. "అభివృద్ధి అంటే కేవలం ఇళ్లు నిర్మించడం మాత్రమే కాదు. ఆ ఇళ్లలో నివసించేవారి జీవితాల్లో గౌరవం, స్వావలంబనతో వెలుగులు నింపాలి" అని పెమ్మసాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


3D printed house
Pemmasani Chandrasekhar
rural housing
Central Building Research Institute
PM Gramin Awas Yojana
rural development
Uttarakhand
housing technology
3D concrete printing
affordable housing

More Telugu News