Mithun Reddy: ఈ కేసులన్నీ ఒక్క రోజులో పోయేవే: మిథున్ రెడ్డి

Mithun Reddy All These Cases Will Disappear in a Day
  • తనపై అక్రమ కేసులు పెట్టారన్న మిథున్ రెడ్డి
  • జగన్ కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని వ్యాఖ్య
  • రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని ధీమా
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి, బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అధికార కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై పెట్టినవి అక్రమ కేసులని, వీటిని చూసి భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. జైల్లో తనను ఒక ఉగ్రవాదిలా చూశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, రాష్ట్రంలో మళ్లీ రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మిథున్ రెడ్డి ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. "టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని వేధించడం, మాపై కేసులు పెట్టడం మామూలే. కేవలం మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసులు పెట్టారు. ఇలాంటి వాటికి భయపడతామని అనుకుంటే అది వారి భ్రమే అవుతుంది. ఇవన్నీ ఒక్కరోజులోనే వీగిపోయే కేసులు" అని ఆయన కొట్టిపారేశారు.

రెండున్నర నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చిందని, అక్కడ తనను చాలా ఇబ్బందులకు గురి చేశారని మిథున్ రెడ్డి తెలిపారు. అయితే, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు, తమ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలిచారని పేర్కొన్నారు. "మా అధినేత జగన్ మా వెంటే ఉన్నారు. మా కుటుంబానికి ఎవరికీ ఇవ్వని గుర్తింపు ఇచ్చారు. ఆయన కోసం, మళ్లీ జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం, ఎన్ని ఇబ్బందులైనా భరిస్తాం" అని ఆయన అన్నారు. కోర్టు ఆంక్షల కారణంగా కేసు గురించి ఎక్కువగా మాట్లాడలేనని, ఎన్ని కష్టాలు పెట్టినా అధైర్యపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు.

Mithun Reddy
AP Liquor Scam
YSRCP
YS Jaganmohan Reddy
Andhra Pradesh Politics
Illegal Cases
TDP
Jail Release
Political Harassment

More Telugu News