Asaduddin Owaisi: పాకిస్థాన్‌పై ఆపరేషన్ ఎందుకు ఆపారు?: కేంద్రాన్ని ప్రశ్నించిన ఒవైసీ

Asaduddin Owaisi Questions Halt of Operation Against Pakistan
  • పాక్ పై ఆపరేషన్ ఎందుకు ఆగిపోయిందో అర్థం కావడం లేదన్న ఒవైసీ
  • తనకు కలలు కనే అలవాటు లేదని వ్యాఖ్య
  • తమ లక్ష్యం కేవలం పదవులు చేపట్టడం కాదన్న ఒవైసీ
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ ప్రారంభించిన సైనిక చర్యలను మధ్యలోనే ఎందుకు నిలిపివేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశమంతా ఒక్కతాటిపై నిలిచి, గట్టి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆపరేషన్‌ను ఆపివేయడం వెనుక కారణమేంటని ఆయన నిలదీశారు.

పహల్గాం దాడి జరిగినప్పుడు మీరే ప్రధాని అయితే ఏం చేసేవారని ఓ విలేకరి ప్రశ్నించగా, ఒవైసీ ఆ ప్రశ్నను సున్నితంగా పక్కనపెట్టారు. "సోదరా, అలాంటి కలలు కనే అలవాటు నాకు లేదు. నేను వాస్తవంలో ఉంటాను. మా లక్ష్యం కేవలం పదవులు చేపట్టడం కాదు" అని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం ఆయన అసలు విషయానికి వస్తూ, పహల్గాం ఘటన తర్వాత పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్‌కు ఒక మంచి అవకాశం లభించిందని అన్నారు. "అదొక యుద్ధం లాంటి పరిస్థితి. అలాంటి సమయంలో ఆపరేషన్ ఎందుకు ఆగిపోయిందో నాకు నిజంగా అర్థం కావడం లేదు. దేశం మొత్తం గట్టి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారు? ఇప్పుడు పార్లమెంటులో కూర్చుని పీవోకేను స్వాధీనం చేసుకుంటామని మాట్లాడతారు" అంటూ ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

ఈ ఏడాది ఏప్రిల్ 22న "మినీ స్విట్జర్లాండ్"గా పిలిచే పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక నేపాల్ జాతీయుడితో సహా 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ "ఆపరేషన్ సిందూర్" చేపట్టింది. పాకిస్థాన్, పీవోకేలోని 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిరవధికంగా నిలిపివేయడంతో పాటు పాక్ జాతీయులను వెనక్కి పంపింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ డ్రోన్లతో భారత పౌర ప్రాంతాలపై దాడులకు దిగింది. 
Asaduddin Owaisi
Pahalgam attack
Operation Sindoor
India Pakistan
POK
terrorism
Kashmir
military operation
Uri attack
ceasefire

More Telugu News