Salman Ali Agha: సూర్యకుమార్‌కు పోటీగా విరాళం ప్రకటన.. చిక్కుల్లో పాక్ కెప్టెన్!

Salman Ali Agha donation sparks controversy after Suryakumar Yadavs gesture
  • పహల్గామ్ దాడి బాధితులకు సూర్యకుమార్ మ్యాచ్ ఫీజు విరాళం
  • దీనికి ప్రతిగా పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా సంచలన ప్రకటన
  • భారత్ జరిపిన 'ఆపరేషన్ సిందూర్' బాధితులకు విరాళమంటూ వ్యాఖ్య
  • ఆఘా వ్యాఖ్యలపై బీసీసీఐ అభ్యంతరం, ఫిర్యాదుకు సిద్ధం
  • క్రీడా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణ
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్థాన్ టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా రాజకీయ అంశాన్ని ప్రస్తావించడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆఘాపై అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే?
ఆసియా కప్ 2025 ఫైనల్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక ఉదార‌మైన నిర్ణయం తీసుకున్నాడు. టోర్నీ ద్వారా తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని (సుమారు రూ. 28 లక్షలు) పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు, భారత సైన్యానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. సూర్య‌ నిర్ణయాన్ని అందరూ ప్రశంసించారు.

అయితే, ఫైనల్ ఓటమి అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, సూర్యకుమార్‌కు పోటీగా ఓ ప్రకటన చేశాడు. పహల్గామ్ దాడికి ప్రతిగా భారత సైన్యం పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన 'ఆపరేషన్ సిందూర్' దాడుల్లో నష్టపోయిన తమ పౌరులకు, పిల్లలకు తమ జట్టు మ్యాచ్ ఫీజును విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. "భారత్ జరిపిన దాడిలో ప్రభావితమైన మా పౌరులకు మా జట్టు మొత్తం మ్యాచ్ ఫీజును విరాళంగా ఇస్తున్నాం" అని ఆఘా తెలిపాడు.

బీసీసీఐ అభ్యంతరం
రెండు దేశాల మధ్య అత్యంత సున్నితమైన సైనిక చర్య గురించి క్రికెట్ వేదికపై మాట్లాడటంపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆఘా వ్యాఖ్యలు కేవలం వివాదాస్పదం కావడమే కాకుండా, పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇది క్రీడా నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించడమేనని, ఈ అంశం అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీయవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత్ నిరాకరించిన ఉదంతాన్ని కూడా ఆఘా సమర్థించాడు. "ఏసీసీ అధ్యక్షుడి నుంచి మీరు ట్రోఫీ తీసుకోకపోతే, అది మీకు ఎలా వస్తుంది?" అని ఆయన ప్రశ్నించాడు. మొత్తంగా ఆఘా వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో కొత్త వివాదానికి తెరలేపాయి. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.
Salman Ali Agha
Pakistan cricket
Asia Cup 2025
Suryakumar Yadav
BCCI
Operation Sindoor
India Pakistan relations
Mohsin Naqvi
ACC President
Pahalgam attack

More Telugu News