Kantara Chapter 1: కాంతార ఛాప్టర్-1 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Kantara Chapter 1 AP Government Allows Ticket Price Hike
  • కాంతార ఛాప్టర్ - 1 ప్రీమియర్ షో ప్రదర్శనకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
  • ప్రీమియర్ షో, టికెట్ ధరల పెంపుపై జీవో విడుదల చేసిన ఏపీ సర్కార్
  • హర్షం వ్యక్తం చేసిన చిత్ర బృందం
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన విజయవంతమైన చిత్రం 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వస్తున్న 'కాంతార చాప్టర్ 1' సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఒకరోజు ముందుగానే, అంటే అక్టోబర్ 1 (బుధవారం) రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అంతేకాకుండా, సినిమా విడుదల రోజు నుంచి అక్టోబర్ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా అనుమతి మంజూరు చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టికెట్ ధర పెంపు ఇలా..
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో: రూ.75 వరకు (జీఎస్టీ అదనంగా)
మల్టీప్లెక్స్‌లలో: రూ.100 వరకు (జీఎస్టీ అదనంగా)
ఈ ధరలు ప్రీమియర్ షోలకు కూడా వర్తిస్తాయి.

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది.

ఇదిలా ఉండగా, ఇటీవల కర్ణాటకలో తెలుగు సినిమాలకు ఎదురవుతున్న ఇబ్బందులపై పవన్ కల్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో ఎదురైన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని 'కాంతార 1'కి ఇక్కడ ఆటంకాలు కల్పించడం సమంజసం కాదని పవన్ కల్యాణ్ అన్నారు.

అదే సమయంలో 'కాంతార చాప్టర్ 1' టికెట్ ధరల పెంపుపై ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రాంతీయ భావాల కన్నా జాతీయ భావనకే ప్రాధాన్యం ఇవ్వాలని, మంచి మనసుతో వ్యవహరించాలని సూచించారు. ఈ సినిమా ధరల పెంపునకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా వచ్చిన జీవోపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. 
Kantara Chapter 1
Rishab Shetty
AP Government
Ticket Price Hike
Andhra Pradesh
Nara Chandrababu Naidu
Pawan Kalyan
Kandula Durgesh
Hombale Films
Telugu Movies

More Telugu News