Nara Lokesh: ప్రఖ్యాత కంపెనీ ఎయిర్ బస్ కోసం ఏపీ ముందడుగు... ఢిల్లీలో నారా లోకేశ్ కీలక సమావేశం

Nara Lokesh meets Airbus board for AP aerospace hub
  • ఎయిర్‌బస్ బోర్డుతో ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్ ఉన్నత స్థాయి సమావేశం
  • ఏపీలో విమానాల తయారీ యూనిట్ ఏర్పాటుకు కీలక ప్రతిపాదన
  • ప్రధాన యూనిట్‌తో పాటు అనుబంధ పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటుపై చర్చ
  • రాష్ట్ర ఏరోస్పేస్ పాలసీ, వేగవంతమైన అనుమతులపై లోకేశ్ వివరణ
  • ఏపీని ఏరోస్పేస్ ఎగుమతుల హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
  • మేకిన్ ఇండియా'లో భాగంగా అవకాశాలు అన్వేషిస్తున్న ఎయిర్‌బస్
రాష్ట్రాన్ని ఏరోస్పేస్ రంగంలో కీలక కేంద్రంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో ఆ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 'మేకిన్ ఇండియా' అవకాశాలను పరిశీలించేందుకు తొలిసారిగా భారత్‌కు వచ్చిన ఎయిర్‌బస్ బోర్డు ముందు మంత్రి లోకేశ్ ఒక ఆకర్షణీయమైన ప్రతిపాదన ఉంచారు.

ఈ భేటీలో ఎయిర్‌బస్ ఛైర్మన్ రెనీ ఒబెర్మన్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీలో కేవలం ప్రధాన యూనిట్‌ను మాత్రమే కాకుండా, దానికి అనుబంధంగా టైర్-1, టైర్-2 సరఫరాదారులు, ఇతర భాగస్వాములతో కూడిన ఒక ఇంటిగ్రేటెడ్ ఏరోస్పేస్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీనివల్ల తయారీ ప్రక్రియ వేగవంతం అవ్వడమే కాకుండా, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి సాధ్యమవుతుందని వివరించారు.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని లోకేశ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూమి, పరిశ్రమలకు అనుకూలమైన ఏరోస్పేస్ పాలసీ, టెక్నాలజీ బదిలీకి ఉన్న సానుకూలతలను ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెట్టుబడులను ఆకర్షించడంలో ఉన్న ట్రాక్ రికార్డును, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు ఇస్తామని, ప్రాజెక్టును నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్రాన్ని ఎగుమతి ఆధారిత ఏరోస్పేస్ హబ్‌గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ తెలిపారు. అభివృద్ధి చేస్తున్న ఏరోస్పేస్ కారిడార్లలో ఎయిర్‌బస్ అవసరాలకు తగినట్టుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన బోర్డుకు హామీ ఇచ్చారు.
Nara Lokesh
Airbus
Andhra Pradesh
Aerospace
Manufacturing
Investments
Make in India
Chandrababu Naidu
AP Government
Rene Obermann

More Telugu News