Donald Trump: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత వృద్ధి రేటుపై ప్రభావం ఏమేరకు ఉంటుందో చెప్పిన ఏడీబీ

Donald Trump Tariffs Impact on India Growth Rate ADB Report
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనా 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించిన ఏడీబీ
  • అమెరికా సుంకాల కారణంగా వాణిజ్య ఎగుమతులు తగ్గే అవకాశం ఉందన్న ఏడీబీ
  • సేవల ఎగుమతులు మాత్రం బలంగా ఉంటాయన్న ఏడీబీ
ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాను కూడా 6.8 శాతం నుండి 6.5 శాతానికి సవరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై విధించిన కొత్త టారిఫ్‌ల కారణంగా వృద్ధి మందగించే అవకాశం ఉందని ఏడీబీ పేర్కొంది. అమెరికా, భారతదేశం నుంచి దిగుమతులపై 50 శాతం సుంకాల విధించిన విషయం విదితమే.

టారిఫ్ ప్రభావం వల్ల ఈ ఏడాది ద్వితీయార్థంలో వృద్ధి కొంతమేర తగ్గే అవకాశం ఉందని ఏడీబీ తన నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వ వ్యయం మెరుగ్గా ఉండటం, వినియోగం పుంజుకోవడంతో 2025-26 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. అయితే, ద్వితీయార్థంలో ఇది కొంత తగ్గవచ్చని ఏడీబీ అంచనా వేసింది.

అమెరికా సుంకాల కారణంగా వాణిజ్య ఎగుమతులు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, సేవల ఎగుమతులు మాత్రం బలంగా ఉంటాయని, ఇవి వృద్ధికి కీలక చోదకశక్తిగా నిలుస్తాయని ఏడీబీ అభిప్రాయపడింది. దేశీయంగా గిరాకీ పటిష్టంగా ఉండటంతో సేవల రంగం ఎగుమతులపై టారిఫ్ ప్రభావం పరిమితంగా ఉండవచ్చని తెలిపింది. అంతేకాకుండా, ఇతర దేశాలకు ఎగుమతులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
Donald Trump
India GDP
Indian economy
ADB
Asian Development Bank
India growth rate
US tariffs

More Telugu News