Andhra Pradesh Floods: కోస్తాంధ్రకు వర్ష సూచన... ఎల్లో అలర్ట్ జారీ

Coastal Andhra Weather Alert Heavy Rains Forecast Due to Cyclone
  • 24 గంటల్లో అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం
  • ఉత్తర కోస్తాలో భారీ వర్షాలకు అవకాశం
  • ప్రకాశం బ్యారేజ్‌కు రెండో ప్రమాద హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని ఒకేసారి వర్షాలు, వరదలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓవైపు ఉత్తర కోస్తా సమీపంలో ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు కృష్ణా, గోదావరి నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం, ఉత్తర కోస్తా పరిసరాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా కోస్తాంధ్ర అంతటా ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఇదిలా ఉండగా, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉద్ధృతి కొనసాగుతోంది. అధికారులు ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజ్‌లోకి 6.55 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తుండగా, అధికారులు అంతేస్థాయిలో 6.39 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బ్యారేజ్ దిగువన వారధి వద్ద 3 వేల ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచారు.

మరోవైపు, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా వరద ప్రవాహం భారీగా ఉంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. గోదావరి నుంచి 10.20 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
Andhra Pradesh Floods
Coastal Andhra
Krishna River
Godavari River
Weather Alert
Heavy Rains
Prakasam Barrage
Dhavaleswaram Barrage
Yellow Alert
India Weather

More Telugu News