Suryakumar Yadav: ట్రోఫీని మేం వద్దనలేదు, వాళ్లే ఎత్తుకెళ్లారు.. అసలు విషయం చెప్పిన భారత కెప్టెన్

Suryakumar Yadav Narrates Asia Cup Final Drama As New Video Surfaces
  • ఆసియా కప్ ఫైనల్ ట్రోఫీ వివాదంపై స్పందించిన కెప్టెన్ సూర్య
  • ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీ తీసుకుని పారిపోయారంటూ సంచలన ఆరోపణ
  • పాక్ రాజకీయ నేత చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన టీమిండియా
  • ఈ నిర్ణయం ఆటగాళ్లు మైదానంలో సొంతంగా తీసుకున్నదేనని స్పష్టీకరణ
  • తాము డ్రెస్సింగ్ రూమ్‌లో వేచి చూడలేదని, బయటే ఉన్నామని వెల్లడి
ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించినా, ట్రోఫీ అందుకోకపోవడంపై చెలరేగిన వివాదంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రోఫీని తాము తిరస్కరించలేదని, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధికారులే దానిని తీసుకుని పారిపోయారని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ స్పష్టత నిచ్చాడు.

ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. అనంతరం జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవంలో ఏసీసీ చీఫ్, పాకిస్థాన్‌కు చెందిన రాజకీయ నేత‌ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. దీంతో నఖ్వీ వేదిక నుంచి వెళ్లిపోగా, ఓ అధికారి ట్రోఫీని వెనక్కి తీసుకువెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ ఘటనపై సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, "మేము డ్రెస్సింగ్ రూమ్‌లో తలుపులు మూసుకుని కూర్చోలేదు. బహుమతి ప్రదానోత్సవం కోసం ఎవరినీ ఎదురు చూసేలా చేయలేదు. అసలు వాళ్లే ట్రోఫీ తీసుకుని పారిపోయారు. నేను చూసింది అదే. మేము అక్కడే నిలబడి ఉన్నాం కానీ లోపలికి వెళ్ల‌లేదు" అని వివరించాడు.

భారత ప్రభుత్వమో లేక బీసీసీఐ ఆదేశాల మేరకో టీమిండియా ఈ నిర్ణయం తీసుకుందని పాకిస్థాన్ క్రికెట్ వర్గాల నుంచి వస్తున్న ఆరోపణలను సూర్యకుమార్ తీవ్రంగా ఖండించాడు. "ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. టోర్నమెంట్ మొత్తంలో ప్రభుత్వం నుంచి గానీ, బీసీసీఐ నుంచి గానీ మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఫలానా వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవద్దని మాకు ఎవరూ చెప్పలేదు. ఆ నిర్ణయం పూర్తిగా మేమే మైదానంలో సొంతంగా తీసుకున్నాం" అని సూర్య స్ప‌ష్టం చేశాడు.

"ఏసీసీ అధికారులు వేదికపై నిలబడి ఉన్నారు. మేము కింద ఉన్నాం. వారు స్టేజ్‌పై మాట్లాడుకోవడం చూశాను. ఇంతలో ప్రేక్షకుల నుంచి కొందరు అరుస్తున్నారు. ఆ తర్వాత వారి ప్రతినిధి ఒకరు ట్రోఫీని తీసుకుని వేగంగా వెళ్లిపోవడం కనిపించింది" అని సూర్యకుమార్ ఆ ఘటనను వివ‌రించాడు. ఆటగాళ్లు సమష్టిగా తీసుకున్న నిర్ణయమే తప్ప, దీని వెనుక ఎలాంటి బాహ్య ఒత్తిళ్లు లేవని ఆయన మాటలతో స్పష్టమైంది.


Suryakumar Yadav
Asia Cup 2025
India vs Pakistan
ACC
Mohsin Naqvi
BCCI
Cricket controversy
Trophy presentation
Asia Cricket Council
Indian Cricket Team

More Telugu News