Sabari Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. శబరి ఎక్స్‌ప్రెస్ ఇక సూపర్‌ఫాస్ట్.. రెండు గంటల సమయం ఆదా!

Sabari Express Now Superfast Saving Two Hours
  • సూపర్‌ఫాస్ట్‌గా మారిన సికింద్రాబాద్- తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్
  • నేటి నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు
  •  17229/30 నుంచి 20629/30గా మారిన రైలు నంబర్
  •  రెండు వైపులా ప్రయాణ వేళల్లో మార్పులు
సికింద్రాబాద్- తిరువనంతపురం (త్రివేండ్రం) మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ మార్గంలో ఎంతో కీలకమైన శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్ రైలుగా మార్చింది. ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. రైలు వేగం పెరగడం వల్ల ప్రయాణికులకు సుమారు రెండు గంటల ప్రయాణ సమయం కలిసి రానుంది.

ఈ మార్పులో భాగంగా రైలు నంబర్‌ను కూడా మార్చారు. ఇప్పటివరకు 17229/30 నంబర్లతో నడిచిన ఈ రైలు, ఇకపై 20629/30 నంబర్లతో సూపర్‌ఫాస్ట్‌గా పరుగులు పెట్టనుంది. రైలు వేగాన్ని పెంచడంతో పాటు, ప్రయాణ వేళల్లో కూడా అధికారులు కీలక మార్పులు చేశారు.

కొత్త టైమింగ్స్ ప్రకారం సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:25 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. గతంలో ఈ రైలు మధ్యాహ్నం 12:20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6:05 గంటలకు గమ్యస్థానానికి చేరేది.

అదేవిధంగా తిరుగు ప్రయాణంలో, తిరువనంతపురంలో ఉదయం 6:45 గంటలకు బయలుదేరే సమయం యథాతథంగా ఉన్నప్పటికీ, సికింద్రాబాద్‌కు మాత్రం ఉదయం 11 గంటలకే చేరుకుంటుంది. ఇంతకుముందు ఈ రైలు మధ్యాహ్నం 12:45 గంటలకు సికింద్రాబాద్ చేరేది. ఈ మార్పుల వల్ల ప్రయాణికులు మరింత వేగంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని రైల్వే వర్గాలు తెలిపాయి.
Sabari Express
Secunderabad
Thiruvananthapuram
Indian Railways
Superfast train
Train timings
Travel
Railways
Kerala

More Telugu News