Gandhi Statue Vandalized: లండన్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

Mahatma Gandhi Statue Vandalized in London India Condemns Act
  • లండన్‌లోని టవిస్టాక్ స్క్వేర్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం
  • విగ్రహం పీఠంపై భారత వ్యతిరేక రాతలు
  • దీన్ని సిగ్గుచేటైన చర్యగా పేర్కొన్న‌ భారత హైకమిషన్
  • అహింసా సిద్ధాంతంపై దాడిగా అభివర్ణన
  • విగ్రహ పునరుద్ధరణకు చర్యలు, దర్యాప్తు ప్రారంభం
మహాత్మాగాంధీ జయంతి వేడుకలకు ప్రపంచం సిద్ధమవుతున్న వేళ, లండన్‌లో ఆయన విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. నగరంలోని ప్రఖ్యాత టవిస్టాక్ స్క్వేర్‌లో ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ధ్వంసం చేశారు. అక్టోబర్ 2న జరగనున్న గాంధీ జయంతి ఉత్సవాలకు కొన్ని రోజుల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ దుశ్చర్యను లండన్‌లోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. ఇది సిగ్గుచేటైన చర్య అని, అహింసా సిద్ధాంతంపై జరిగిన దాడి అని అభివర్ణించింది.

ధ్యానముద్రలో కూర్చుని ఉన్న గాంధీ విగ్రహం పీఠంపై దుండగులు భారత వ్యతిరేక రాతలు రాశారు. ఈ ఘటనపై భారత హైకమిషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. "ఇది కేవలం విగ్రహాన్ని ధ్వంసం చేయడం కాదు, అంతర్జాతీయ అహింసా దినోత్సవానికి మూడు రోజుల ముందు అహింసా వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడి. ఈ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. విగ్రహాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావడానికి మా బృందం ఇప్పటికే అధికారులతో కలిసి పనిచేస్తోంది" అని హైకమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

విషయం తెలుసుకున్న వెంటనే భారత దౌత్యవేత్తలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విగ్రహ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న మెట్రోపాలిటన్ పోలీసులు, స్థానిక కామ్డెన్ కౌన్సిల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

శాంతికి నిలయమైన ప్రదేశంలో..
లండన్‌లో గాంధీ న్యాయ విద్య అభ్యసించిన యూనివర్సిటీ కాలేజీకి సమీపంలో ఉన్న టవిస్టాక్ స్క్వేర్‌లో 1968లో ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 2వ తేదీని 'అంతర్జాతీయ అహింసా దినోత్సవం'గా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా ఇక్కడి విగ్రహానికి పూలమాలలు వేసి, గాంధీజీకి ఇష్టమైన భజనలతో నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రాంగణంలోనే హిరోషిమా బాంబు బాధితుల స్మారకార్థం చెర్రీ చెట్టును, శాంతికి గుర్తుగా ఇతర స్మారకాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతాన్ని లండన్ "శాంతి ఉద్యానవనం" (పీస్ పార్క్) అని పిలుస్తారు. అలాంటి చోట ఈ విధ్వంసం జరగడం గమనార్హం.
Gandhi Statue Vandalized
Mahatma Gandhi
London
Tavistock Square
India High Commission
Anti-India graffiti
International Day of Non-Violence
Peace park London

More Telugu News