Asif: పటాన్‌చెరులో దోపిడీ దొంగల బీభత్సం.. అడ్డుకున్న డ్రైవర్‌పై కత్తితో దాడి.. మృతి

Patancheru Robbery Lorry Driver Murdered on Highway 161
  • సంగారెడ్డి జిల్లాలో హైవేపై దోపిడీ దొంగల వీరంగం
  • డబ్బుల కోసం లారీ డ్రైవర్ అసిఫ్ దారుణ హత్య
  • దోపిడీని ప్రతిఘటించడంతో కత్తులతో దాడి
  • ఒకే రాత్రి పలువురు డ్రైవర్లే లక్ష్యంగా దాడులు
  • ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలో జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో లారీ డ్రైవర్లే లక్ష్యంగా  వరుస దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తమను ప్రతిఘటించిన ఓ లారీ డ్రైవర్‌ను కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జాతీయ రహదారి 161పై చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం అసిఫ్ (36) అనే లారీ డ్రైవర్ కొండాపూర్‌లోని వెంకటేశ్వర ఫంక్షన్ హాలు సమీపంలో తన లారీని ఆపి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు డబ్బుల కోసం అతడిపై దాడి చేశారు. అసిఫ్ వారిని గట్టిగా ఎదిరించడంతో, దొంగలు కత్తితో అతడి పక్కటెముకల్లో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అసిఫ్‌ను వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం అతను ప్రాణాలు కోల్పోయాడు.

అంతకుముందు ఇదే ముఠా మరికొన్ని దోపిడీలకు పాల్పడింది. రుద్రారం వద్ద ఆగి ఉన్న లారీ డ్రైవర్ నూర్‌ షేక్‌కు సహాయం చేసేందుకు వచ్చిన మేనేజర్ రాఘవేందర్‌పై దాడి చేసి రూ. 5 వేలు దోచుకున్నారు. ఆ తర్వాత, ముత్తంగి వంతెన కింద లారీ ఆపిన మంచిర్యాలకు చెందిన డ్రైవర్ ఎండీ వసీం, క్లర్క్ తోటరాజును బెదిరించి వారి వద్ద నుంచి రూ. 15 వేలు లాక్కొని పరారయ్యారు. ఒకే రాత్రి జరిగిన ఈ వరుస ఘటనలతో లారీ డ్రైవర్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పటాన్‌చెరు పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Asif
Patancheru
Sangareddy
lorry driver
robbery
murder
National Highway 161
crime
Telangana

More Telugu News