Food Waste Report 2024: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఆహార వృథా.. రెండో స్థానంలో భారత్

India Second Highest in Food Waste Globally UNEP Report
  • ఆహార వృధాపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం నివేదిక
  • ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతున్న ఆహారంలో భారత్ రెండో స్థానం
  • దేశంలో ఏటా 7.81 కోట్ల టన్నుల ఆహారం చెత్తపాలు
  • ప్రతి భారతీయుడు ఏడాదికి సగటున 55 కిలోలు వృథా చేస్తున్నట్లు వెల్లడి
  • ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా 78 కోట్ల మంది ఆకలితో అలమటింపు
ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆకలితో అలమటిస్తుంటే, మరోవైపు అంతకు మించిన స్థాయిలో ఆహారం వృథా అవుతోంది. ఈ తీవ్రమైన వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతూ ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) విడుదల చేసిన 'ఫుడ్ వేస్ట్ రిపోర్ట్ 2024' ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. ఈ నివేదిక ప్రకారం, ఆహారాన్ని అత్యధికంగా వృథా చేస్తున్న దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

యూఎన్ఈపీ నివేదిక ప్రకారం, 2022 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా రిటైల్, ఫుడ్ సర్వీస్, గృహ రంగాల్లో కలిపి ఏకంగా 105 కోట్ల టన్నుల ఆహారం వృథా అయింది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న మొత్తం ఆహారంలో ఇది దాదాపు 19 శాతమని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ప్రజలు ఆకలితో బాధపడుతుంటే, ప్రతి సంవత్సరం ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన ఆహారం చెత్తపాలు కావడం గమనార్హం.

దేశాలవారీగా చూస్తే, చైనాలో ఏటా 10.87 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతుండగా, భారత్‌లో ఈ సంఖ్య 7.81 కోట్ల టన్నులుగా నమోదైంది. అమెరికాలో 2.47 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు నివేదిక తెలిపింది. అయితే, కేవలం జనాభాను బట్టి కాకుండా, తలసరి ఆహార వృథాను పరిశీలించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అమెరికాలో ప్రతి వ్యక్తి సగటున ఏడాదికి 73 కిలోల ఆహారాన్ని పారవేస్తుంటే, భారత్‌లో ఈ సంఖ్య 55 కిలోలుగా ఉంది.

ఈ ఆహార వృథా కేవలం ఆకలి సమస్యకే కాకుండా, పర్యావరణానికి కూడా పెను ముప్పుగా పరిణమిస్తోందని నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న గ్రీన్‌హౌస్ వాయువులలో 8 నుంచి 10 శాతం ఈ ఆహార వృథా కారణంగానే విడుదల అవుతున్నాయని పేర్కొంది. అంతేకాకుండా, ప్రపంచ వ్యవసాయ భూమిలో దాదాపు 30 శాతం వృథా అవుతున్న ఆహారాన్ని పండించడానికే ఉపయోగపడుతోందని వివరించింది. ఈ సమస్య అన్ని ఆదాయ వర్గాల దేశాల్లోనూ తీవ్రంగానే ఉందని, దీనిని అరికట్టేందుకు తక్షణ చర్యలు అవసరమని నివేదిక స్పష్టం చేసింది.
Food Waste Report 2024
UNEP
food waste
India
China
global hunger
food loss
greenhouse gases
environmental impact
food security

More Telugu News