AP Weather: ముగిసిన నైరుతి సీజన్: మొదట కరవు.. చివర్లో వరదలు!

Andhra Pradesh Southwest Monsoon Season Ends With Mixed Results
  • నేటితో ముగిసిన నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్
  • మొదట్లో కరవు ఛాయలు, ఆ తర్వాత భారీ వర్షాలతో మిశ్రమ అనుభవం
  • రాష్ట్రవ్యాప్తంగా 3.1 శాతం స్వల్ప లోటు వర్షపాతం నమోదు
  • గుంటూరు, కర్నూలు సహా నాలుగు జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు
  • కోనసీమ, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం
  • సీజన్ ముగిసినా వర్షాలు కొనసాగే అవకాశం
ఏపీలో నాలుగు నెలల పాటు కొనసాగిన నైరుతి రుతుపవనాల సీజన్ మంగళవారంతో అధికారికంగా ముగిసింది. ఈసారి రుతుపవనాలు రాష్ట్ర రైతాంగానికి మిశ్రమ అనుభవాలను మిగిల్చాయి. సీజన్ ఆరంభంలో వర్షాల కోసం ఎదురుచూసేలా చేసి కరవు ఛాయలను పరిచయం చేయగా, చివర్లో మాత్రం కొన్ని జిల్లాలను భారీ వర్షాలు, వరదలతో ముంచెత్తాయి.

వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం, జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో సాధారణంగా 570.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 553.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 3.1 శాతం మాత్రమే తక్కువ. రాష్ట్ర సగటు సాధారణంగా ఉన్నప్పటికీ, జిల్లాల మధ్య వర్షపాతంలో తీవ్ర వ్యత్యాసాలు కనిపించాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఏకంగా 43.4 శాతం, కర్నూలులో 37.9 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. వీటితో పాటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వానలు పడ్డాయి.

అయితే, ఇందుకు పూర్తి భిన్నంగా కోనసీమ, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ జిల్లాలో 30.4 శాతం, పశ్చిమ గోదావరిలో 23.9 శాతం, తూర్పు గోదావరిలో 22.2 శాతం, నెల్లూరులో 20.6 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని మిగిలిన 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమలోని అనేక మండలాల్లో ఈసారి మెరుగైన వర్షాలు పడటం గమనార్హం.

సీజన్ తొలి రెండు నెలలైన జూన్, జులైలో వర్షాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు 25 శాతం లోటుతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పుంజుకున్న వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. 

మరోవైపు, కర్నూలు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు వంటి జిల్లాల్లో కురిసిన కుండపోత వానలతో వరదలు సంభవించాయి. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రధాన జలాశయాలు నిండుకుండలా మారాయి. నైరుతి సీజన్ అధికారికంగా ముగిసినప్పటికీ, రాష్ట్రంలో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
AP Weather
Andhra Pradesh Rainfall
Rayalaseema
Krishna River
Godavari River
Monsoon Season
Guntur District
Kurnool District
AP Agriculture
AP Floods

More Telugu News