Chandrababu Naidu: జీఎస్టీ 2.0 ఫలాలు ఇంటింటికీ... వేర్వేరు థీమ్స్‌తో ప్రజల్లోకి వెళదాం: సీఎం చంద్రబాబు

Chandrababu Focuses on GST 20 Awareness Campaign
  • ఇంటింటికీ జీఎస్టీ 2.0 ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ
  • అక్టోబర్ 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా 65 వేల కార్యక్రమాలతో ప్రచారం
  • ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో అవగాహన సదస్సులు
  • కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
  • ప్రచార ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రాల్లో దీపావళి సంబరాలు, షాపింగ్ ఫెస్టివల్స్
  • రంగాల వారీగా వినూత్న రీతిలో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు
సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికీ తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను ప్రజలు, వినియోగదారుల్లోకి తీసుకెళ్లేలా విస్తృత ప్రచారం చేసేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా 65 వేల సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజల్లోకి వెళ్లి, వచ్చే నెల 19వ తేదీ వరకు వేర్వేరు థీమ్‌లతో ఈ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ కమిటీకి సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు. 

దీనిపై అధికారులు మాట్లాడుతూ...ఇప్పటికే ‘ఇంటింటికీ జీఎస్టీ ఫలాలు’ థీమ్‌తో నిత్యవసరాలు, ఔషధాలు, స్టేషనరీ, వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, మహిళలు, చిన్నారులకు సంబంధించిన వస్తులపై పన్నులు తగ్గిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం నిర్వహించామని, క్షేత్రస్థాయిలో వీటిపై అవగాహన కల్పించామన్నారు.

థీమ్‌ల వారీగా విస్తృత ప్రచారం

అన్ని వర్గాలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం  ప్రణాళికలు చేపట్టింది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, చేనేత ఉత్పత్తులు, ఆక్వా, విద్యారంగం, బీమా, ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్, భవన నిర్మాణ రంగం, టూరిజం, ఆతిథ్య రంగం, రవాణా, లాజిస్టిక్స్, క్రీడా పరికరాలు, పునరుత్పాదక విద్యుత్, ఆటో మొబైల్స్, తదితర అంశాలపై రంగాల వారీగా ఆయా శాఖలు ప్రచారం చేపట్టాలని సీఎం సూచించారు. 

రైతులకు అవగాహన కల్పించేలా ట్రాక్టర్ ర్యాలీలు, యంత్రాల ప్రదర్శన చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆప్కో, లేపాక్షి, ఒక జిల్లా-ఒక ఉత్పత్తి పేరిట కార్యక్రమాలు, ఎంఎస్ఎంఈ యూనిట్లలో తయారయ్యే ఉత్పత్తులు, దానికి సంబంధించిన పన్నుల తగ్గింపుపై ప్రచారం నిర్వహించేలా చూడాలన్నారు. సెలూన్లు, యోగా సెంటర్లు, జిమ్‌లలో జీఎస్టీల తగ్గింపు వల్ల ధరలు ఎంత వ్యత్యాసం వచ్చిందో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

విద్యార్థుల్లోనూ అవగాహన పెంచేలా కార్యక్రమాలు

జీఎస్టీ తగ్గింపుతో స్టేషనరీ ఉత్పత్తులపైనా ధరలు గణనీయంగా తగ్గిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. వీటిపై అవగాహన కల్పించేలా విద్యార్థులకు వ్యాస రచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 7 వేల ఉన్నత పాఠశాలలు, 4 వేల జూనియర్ కాలేజీల్లో ఈ ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేశారు. అలాగే జీవిత బీమా, ఆరోగ్య బీమాలకు సంబంధించి జీరో జీఎస్టీ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. 

ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ధరలపై అవగాహన కల్పించేందుకు ఉత్పత్తిదారులు, డీలర్లతో జిల్లా, నియోజకవర్గ, మండలాల వారీగా 850కి పైగా చోట్ల కార్యక్రమాలు చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఇ-కామర్స్ రంగానికి సంబంధించి గిగ్ వర్కర్లలో ద్విచక్ర ర్యాలీలు, స్వదేశీ ఉత్పత్తులపై ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నారు. భవన నిర్మాణ రంగం, ఆతిథ్య రంగం, రవాణా, లాజిస్టిక్స్ పైనా జిల్లా, నియోజకవర్గాల్లో ఎగ్జిబిషన్లు, ర్యాలీలు చేపట్టేలా ప్రణాళిక చేపట్టారు. ఆటబొమ్మలు, క్రీడా పరికరాలు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఆటో మొబైల్స్ ధరలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పిచేలా 200పైగా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

జిల్లా స్థాయిలో దీపావళి సంబరాలు

జీఎస్టీ 2.0 వల్ల కలుగుతున్న లబ్ధిపై ప్రజలకు వివరించేలా వినూత్న రీతిలో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. అక్టోబర్ 18వ తేదీతో క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని ముగించి 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో షాపింగ్ ఫెస్టివల్, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అదే రోజున జిల్లా కేంద్రాల్లో దీపావళి సంబరాలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 

వచ్చే 19వ తేదీ వరకు రేడియో, టీవీ, మీడియా, సోషల్ మీడియా, పత్రికా, సినిమా థియేటర్లు వంటి ప్రసార, ప్రచార మాద్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా జీఎస్టీ 2.0 ఫలాలు తెలిసేలా హోర్డింగులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్, అధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
GST 2.0
Andhra Pradesh
GST benefits
public awareness campaign
tax reduction
state government schemes
Vijay Anand
cabinet sub committee
consumer awareness

More Telugu News