Vijay: విజయ్ కావాలనే ఆలస్యంగా వచ్చారు.. అందుకే తొక్కిసలాట జరిగింది: ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు

Vijay Arrived Late Intentionally Stampede Occurred FIR Highlights
  • విజయ్ కావాలనే బలప్రదర్శన చేయడంతో దుర్ఘటన చోటు చేసుకుందని వెల్లడి
  • మధ్యాహ్నం రావాల్సిన విజయ్ సాయంత్రం వచ్చారని పేర్కొన్న పోలీసులు
  • ప్రచార సభకు వచ్చిన వారికి మంచినీళ్లు, ఆహారం లేకున్నా పట్టించుకోలేదని విమర్శ
టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ ఉద్దేశపూర్వకంగా ప్రచార సభకు ఆలస్యంగా రావటం వల్లనే దుర్ఘటన జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. తమిళనాడులోని కరూర్‌లో విజయ్ ప్రచార సభలో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. విజయ్ కావాలనే రాజకీయ బలప్రదర్శన చేయడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

"విజయ్ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఉదయం 11 గంటలకే జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. మధ్యాహ్నం ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉండగా, ఆయన సాయంత్రం ఏడు గంటలకు వచ్చారు. భారీ జనసందోహాన్ని చూపించడానికే ఆయన ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు. మధ్యాహ్నం నుండి ఎండలో నిలుచున్న ప్రజలు అలసిపోయారు. విజయ్ బస్సు షెడ్యూల్‌కు భిన్నంగా పలుచోట్ల ఆగింది. వాటికి అనుమతి కూడా లేదు. అలా ఆగడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది" అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

ప్రచార సభకు వచ్చిన వారికి మంచినీళ్లు, ఆహారం లేవంటూ చేసిన హెచ్చరికలను విజయ్ కానీ, పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ కానీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. సాయంత్రం ఏడు గంటలకు విజయ్ వచ్చేసరికి జనసమూహాన్ని నిర్వహించడం కష్టంగా మారిందని, అదే తొక్కిసలాటకు దారి తీసిందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
Vijay
Vijay actor
Tamil Nadu
Karur
TVK party
political rally
stampede
FIR
Anand
election campaign

More Telugu News