Dil Raju: పైరసీకి, బెట్టింగ్ యాప్‌లకు లింక్.. నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన

 Dil Raju Announces Ban on Betting App Promotions
  • పైరసీ వెనుక బెట్టింగ్ యాప్‌ల పాత్ర ఉందన్న దిల్ రాజు
  • ఎవరూ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకూడదని నిర్ణయించుకున్నామని వెల్లడి
  • పైరసీ పెరిగే కొద్దీ నేరాలు కూడా పెరుగుతున్నాయని వ్యాఖ్య
తెలుగు సినీ పరిశ్రమ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం కల్పించరాదని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. సినిమా పైరసీ ముఠాలకు, బెట్టింగ్ యాప్‌లకు మధ్య సంబంధాలు బయటపడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో పైరసీకి వ్యతిరేకంగా పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "పైరసీ కార్యకలాపాలపై జరిపిన ప్రాథమిక విచారణలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. పైరసీ వెనుక బెట్టింగ్ యాప్‌ల పాత్ర ఉన్నట్లు గుర్తించాం. అందుకే, మా పరిశ్రమ నుంచి ఇకపై ఎవరూ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకూడదని నిర్ణయించుకున్నాం" అని తెలిపారు. ఈ నిర్ణయం పరిశ్రమతో పాటు ప్రభుత్వానికి కూడా మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పైరసీ వల్ల ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. "సినిమా పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి 18 శాతం జీఎస్టీ వస్తుంది. కానీ పైరసీ వల్ల ఆ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. పైరసీ పెరిగేకొద్దీ నేరాలు కూడా పెరుగుతున్నాయి" అని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను ఒక గొప్ప సినిమా హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే ఆ లక్ష్యానికి పైరసీ అనేది పెద్ద అడ్డంకిగా మారిందని దిల్ రాజు పేర్కొన్నారు. పైరసీని అరికట్టడంలో హైదరాబాద్ పోలీసులు చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ పోరాటంలో పోలీసులకు సినీ పరిశ్రమ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Dil Raju
Telugu film industry
movie piracy
betting apps
GST
CV Anand
Revanth Reddy
Hyderabad police
film hub

More Telugu News