Kollu Ravindra: పండుగ వేళ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన గొప్ప కానుక ఇది: మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra Announces Release of Fee Reimbursement Funds
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,788 కోట్లు చెల్లించిన కూటమి సర్కార్
  • జగన్ హయాంలో పేరుకుపోయిన బకాయిలంటూ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు
  • లక్షలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్ల విడుదలకు చర్యలు
  • పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్నే కొనసాగిస్తామని స్పష్టీకరణ
  • విద్యాశాఖలో లోకేశ్ నాయకత్వంలో విప్లవాత్మక సంస్కరణలని వెల్లడి
  • రాష్ట్రాన్ని "బెస్ట్ నాలెడ్జ్ హబ్"గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి
రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో భాగంగా రూ.1,788 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. పండుగ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందించిన గొప్ప కానుక ఇదని ఆయన అభివర్ణించారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క పేద విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

గత జగన్ ప్రభుత్వ హయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైందని కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,832 కోట్లు, వసతి దీవెన కింద రూ.989 కోట్లు, పీజీ ఫీజుల కింద రూ.450 కోట్లు బకాయిలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని ఆరోపించారు. బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేశాయని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రజాధనాన్ని రంగుల పిచ్చికి, పేరులేని కంపెనీలకు ట్యాబ్‌ల కాంట్రాక్టుల రూపంలో దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. విద్యా కానుక నిధులను సైతం తాడేపల్లి ప్యాలెస్ పనులకు వాడుకున్నారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా విద్యార్థుల సర్టిఫికెట్లు విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నామని, ఫీజుల కోసం విద్యార్థులను వేధించే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని తిరిగి అమలు చేస్తున్నామని, దీని ద్వారా తల్లిదండ్రులపై భారం తగ్గుతుందని వివరించారు. ఫీజు బకాయిలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని తాము సవాల్ విసిరితే, నిజాలు బయటపడతాయనే భయంతో వైసీపీ నేతలు పారిపోయారని ఎద్దేవా చేశారు.

మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో విద్యాశాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామని కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పారదర్శకంగా పేరెంట్ - టీచర్ మీటింగ్‌లు నిర్వహించామని, 'డొక్కా సీతమ్మ భోజనం' పథకం ద్వారా నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని, 'తల్లికి వందనం' పథకంతో ప్రతి బిడ్డకు మేలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఉపాధ్యాయ బదిలీలు పూర్తి చేశామని, మెగా డీఎస్సీ నిర్వహించి తొలి సంతకం హామీని నిలబెట్టుకున్నామని గుర్తుచేశారు. 

గతంలో చంద్రబాబు హయాంలో 1.96 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. విదేశీ విద్య పథకాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, క్వాంటం వ్యాలీ, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
Kollu Ravindra
Andhra Pradesh
Fee Reimbursement
Jagan government
Nara Lokesh
Education sector
Student welfare
Chandrababu Naidu
YSRCP
Teachers transfers

More Telugu News