మెలోని ఆత్మకథకు మోదీ ముందుమాట
- త్వరలో మార్కెట్లోకి మెలోని ఆత్మకథ ఇండియన్ వెర్షన్
- హర్ మన్ కీ బాత్ అంటూ మోదీ వ్యాఖ్య
- తనకు ఇది గొప్ప గౌరవమన్న భారత ప్రధాని
ప్రధాని మోదీ, మెలోని మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై వారిద్దరూ కలుసుకొన్నప్పుడు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే మెలోని పుస్తకానికి ప్రధాని నరేంద్ర మోదీ ముందుమాట రాశారు. మెలోని ఆత్మకథను ‘హర్ మన్ కీ బాత్’ గా మోదీ అభివర్ణించారు. మెలోని పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం లభించడం తనకు గొప్ప గౌరవమని మోదీ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. “ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని జీవితం, నాయకత్వం కాలంతో సంబంధంలేని సత్యాలను మనకు గుర్తుచేస్తాయి. ఈ ఉత్తేజకర జీవిత చరిత్రకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుంది’’ అని రాసుకొచ్చారు.
సాంస్కృతిక వారసత్వం, సమానత్వంపై ఆమెకు అమితమైన విశ్వాసం ఉందని కొనియాడారు. కాగా, మోదీ, మెలోనిలు ఎప్పుడు కలిసి ఫొటోలు దిగినా అవి నెట్టింట వైరల్ గా మారుతుంటాయి. దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్ 28’ సదస్సు వేదికపై సెల్ఫీ తీసుకున్న మోదీ, మెలోని.. ఆ ఫొటోను ఎక్స్ లో షేర్ చేస్తూ వారిద్దరి పేర్లు కలిసేలా ‘మెలోడి’ అంటూ హ్యాష్ ట్యాగ్ జతచేశారు. అప్పటి నుంచి మెలోడి ట్రెండింగ్ గా మారింది.