Chandrababu Naidu: కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు ఆదేశాలు

Chandrababu Naidu Reviews Krishna Godavari Flood Flows Issues Key Directives
  • ప్రతి రిజర్వాయర్, చెరువు నింపాలన్న సీఎం చంద్రబాబు
  • ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశం
  • ప్రకాశం బ్యారేజ్‌కు 7 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందన్న అధికారులు
రాష్ట్రంలో నదీ ప్రవాహాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డైనమిక్ ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌తో నీటి వనరుల సంపూర్ణ వినియోగం జరిగేలా చూడాలని సీఎం సూచించారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలను రియల్ టైంలో అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెయిన్ గేజెస్ ద్వారా కురిసిన వర్షాన్ని లెక్కించి ఫ్లడ్ మేనేజ్‌మెంట్ చేపట్టాలన్నారు. వర్షపాతం, ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీటి ప్రవాహాల సమాచారాన్ని విశ్లేషించి, సమన్వయంతో అన్ని రిజర్వాయర్‌లను పూర్తిగా నింపాలని సీఎం సూచించారు. అదే విధంగా సాధ్యమైనన్ని ఎక్కువ చెరువులను నీటితో నింపాలని ఆదేశించారు.

కృష్ణానదికి 7 లక్షల క్యూసెక్కుల వరద

కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 6.57 లక్షల క్యూసెక్కుల వరద ఉందని అధికారులు తెలిపారు. వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి పంపుతున్నట్లు వివరించారు. సోమవారం సాయంత్రానికి 7 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద వస్తుందని తెలిపారు. అలాగే గోదావరిలో ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 10.12 లక్షల క్యూసెక్కుల వరద ఉందని, ఈ వరద ప్రవాహం పెరిగి 11.50 లక్షల క్యూసెక్కుల వరకు రావచ్చని అధికారులు తెలిపారు.

సముద్రంలోకి వేల టీఎంసీలు

కృష్ణా, గోదావరి నదులకు వస్తున్న భారీ వరద కారణంగా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో కలిపి ప్రస్తుతం 94 శాతం నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పైనుంచి ఇంకా వరద వస్తున్న కారణంగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణానది నుంచి సముద్రంలోకి ఇప్పటి వరకు 1089 టీఎంసీలు వెళ్లాయని అధికారులు వివరించారు. గోదావరి నుంచి 3251 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయని అధికారులు తెలిపారు. సమర్థ నీటి నిర్వహణ, కాలువల్లో ప్రవాహాలు, చెరువులు నింపే కార్యక్రమం వల్ల భూగర్భ జలాలు పెరిగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

గత ఏడాది కంటే ఈ ఏడాది భూగర్భ నీటి మట్టం పెరిగినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరి భూగర్భ నీటి మట్టం 8.43 మీటర్లు ఉందని తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 1.25 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినట్లు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమలో గత ఏడాది కంటే 2.07 మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇంకా వరదలు, వర్షాలు ఉన్న కారణంగా నీటి సమర్థ వినియోగానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. చెరువులు నింపడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు అవసరమైన అన్ని ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు.

మరోవైపు వరదల కారణంగా ముంపు ఉండే ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు సమాచారంతో అప్రమత్తం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఆన్‌లైన్ విధానంలో జరిగిన ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆర్టీజీఎస్ అధికారులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. 
Chandrababu Naidu
Krishna River
Godavari River
Andhra Pradesh Floods
AP CM Review
Flood Management
Reservoir Levels
Water Resources
Groundwater Levels
Prakasam Barrage

More Telugu News