Krishna River: ప్రాణాల మీదకు తెచ్చిన వజ్రాల వేట .. కృష్ణానది వరదలో చిక్కుకున్న 50 మంది

Diamond Hunters Rescued from Krishna River Flood in Andhra Pradesh
  • ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల వద్ద ఘటన
  • వజ్రాల అన్వేషణ కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చిన బృందం
  • గట్టు చుట్టూ నీరు చేరడంతో ఆలయంలో తలదాచుకున్న వైనం
  • పడవల్లో సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన స్థానికులు, టీడీపీ నేత
అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వజ్రాల వేటకు వెళ్లిన వారిని వరద రూపంలో ప్రమాదం చుట్టుముట్టింది. కృష్ణా నదికి ఆకస్మికంగా పెరిగిన వరద నీటిలో చిక్కుకుపోయిన సుమారు 50 మందిని స్థానికులు సకాలంలో స్పందించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద నిన్న చోటుచేసుకుంది.

ఎన్టీఆర్, పల్నాడు, నల్గొండ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వజ్రాల అన్వేషణ కోసం గుడిమెట్ల సమీపంలోని కృష్ణా నది గట్టుకు చేరుకున్నారు. వీరిలో మహిళలు, వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. రాత్రి కావడంతో వారంతా అక్కడే చెట్ల కింద, సమీపంలోని ఆలయాల వద్ద తలదాచుకున్నారు. అయితే, నిన్న ఉదయం నుంచి కృష్ణా నదిలో వరద ప్రవాహం అనూహ్యంగా పెరగడం ప్రారంభించింది. వారు బస చేసిన గట్టు ప్రాంతం చుట్టూ వేగంగా నీరు చేరడంతో బయటకు వెళ్లే మార్గం మూసుకుపోయింది.

దీంతో వారంతా భయాందోళనలకు గురై, సమీపంలోని ద్వారక వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి వెళ్లి తలదాచుకున్నారు. ఇదే సమయంలో వరద తాకిడికి కొట్టుకుపోయిన తమ పడవలను వెతికేందుకు లక్ష్మీపురం గ్రామ టీడీపీ నాయకుడు పూజల వెంకయ్య మరికొంతమంది స్థానికులతో కలిసి పడవలో నదిలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆలయంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఈ బృందాన్ని వారు గమనించారు. వెంటనే స్పందించి, తమ పడవల ద్వారా వారిని విడతలవారీగా సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. స్థానికుల చొరవతో పెను ప్రమాదం తప్పడంతో చిక్కుకుపోయిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Krishna River
Krishna River floods
Andhra Pradesh floods
Diamond hunting
Gudimetla
Chandarlapadu
NTR district
Pujala Venkaiah
Lakshmipuram

More Telugu News