Kuldeep Yadav: కుల్దీప్ దెబ్బకు కుదేల్... పాక్ 146 పరుగులకే ఆలౌట్

Kuldeep Yadav Shines Pakistan All Out for 146
  • ఆసియా కప్ ఫైనల్లో టాస్ గెలచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • భారత బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో కుప్పకూలిన పాక్ బ్యాటింగ్ లైనప్
  • 4 వికెట్లతో చెలరేగిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
  • బుమ్రా, అక్షర్, వరుణ్ చక్రవర్తిలకు తలా రెండు వికెట్లు
  • పాక్ ఓపెనర్లు రాణించినా విఫలమైన మిగతా బ్యాటర్లు
ఆసియా కప్ 2025 ఫైనల్ పోరులో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 19.1 ఓవర్లలో 146 పరుగులకే కట్టడి చేశారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా, మిగతా బౌలర్లు కూడా రాణించడంతో చిరకాల ప్రత్యర్థి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (38 బంతుల్లో 57), ఫఖర్ జమాన్ (35 బంతుల్లో 46) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత శిబిరంలో ఆందోళన రేపారు. అయితే, ఫర్హాన్ ఔటైన తర్వాత పాకిస్థాన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది.

ఒక దశలో 84/0తో పటిష్ఠంగా కనిపించిన పాక్, మరో 62 పరుగులు జోడించేలోపే మిగతా పది వికెట్లనూ కోల్పోయింది. భారత స్పిన్నర్లు విజృంభించడంతో పాక్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో పాక్ మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. కేవలం 30 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు.

అతనికి తోడుగా జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లతో రాణించారు. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు, వన్ డౌన్ బ్యాటర్ సయీం అయూబ్ మినహా మరే బ్యాటర్ కూడా రెండంకెల స్కోరును అందుకోలేకపోవడం గమనార్హం. భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో పాకిస్థాన్ ఓ మోస్తరు లక్ష్యాన్ని కూడా నిర్దేశించలేకపోయింది. ఆసియా కప్ టైటిల్ గెలవాలంటే భారత్ 147 పరుగులు చేయాల్సి ఉంది.
Kuldeep Yadav
Asia Cup 2025
India vs Pakistan
Cricket
Kuldeep Yadav bowling
Pakistan all out
Indian bowlers
Suryakumar Yadav
Dubai International Cricket Stadium
Sahibzada Farhan

More Telugu News