ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టినప్పుడు విమర్శలు సహజం: సీఎం రేవంత్ రెడ్డి
- అంబర్‌పేటలో పునరుద్ధరించిన బతుకమ్మకుంటను ప్రారంభించిన సీఎం రేవంత్
- హైడ్రా ఏర్పాటు ఆలోచనను తొలుత చాలామంది విమర్శించారని వ్యాఖ్య
- రూ.7.15 కోట్లతో 14 ఎకరాల చెరువుకు పునరుజ్జీవం
- చెరువులు, మూసీ కబ్జాలతోనే హైదరాబాద్‌లో వరద ముప్పు అని వెల్లడి
- 2 సెం.మీ. వర్షానికే నగరం అతలాకుతలం కావడంపై ఆందోళన
ఒకప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయిన బతుకమ్మకుంటను తిరిగి పునరుద్ధరించడం ఒక గొప్ప మైలురాయి అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రూ.7.15 కోట్ల వ్యయంతో 14.16 ఎకరాల విస్తీర్ణంలో హైడ్రా చేపట్టిన పనులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి బతుకమ్మలతో హాజరైన స్థానిక మహిళలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైడ్రా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని సీఎం ఆవిష్కరించారు.
చిన్న వర్షానికే నగరం అస్తవ్యస్తం
మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల నగరంలో అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. "హైదరాబాద్‌లో కేవలం 2 సెంటీమీటర్ల వర్షం పడితేనే నగరం అస్తవ్యస్తంగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడమే. ఒకప్పుడు హైదరాబాద్‌కు చెరువులు, మూసీ నది గొప్ప వరం. కానీ ఆక్రమణల వల్ల మూసీ అంటే మురికికూపం అనేలా తయారైంది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వరద నీటిని నియంత్రించడానికి సమగ్ర ప్రణాళికలు అవసరమని, నగరంలోని సహజ వనరులను కాపాడుకోవడం ద్వారానే హైదరాబాద్ భవిష్యత్తు స్థిరంగా ఉంటుందని స్పష్టం చేశారు. బతుకమ్మకుంట పునరుద్ధరణ స్ఫూర్తితో నగరంలోని మిగతా చెరువులను కూడా కాపాడుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.