Tirumala: తిరుమల కొండపైకి వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలకు బ్రేక్!

No permission to private vehicles to Tirumala
  • గరుడ సేవ సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తజనం
  • 4 వేల వాహనాలతో నిండిపోయిన పార్కింగ్ ప్రదేశాలు
  • కొండపైకి ప్రైవేట్ వాహనాల అనుమతిని నిలిపివేసిన అధికారులు
  • భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని టీటీడీ సూచన
  • అలిపిరి వద్ద వేలాదిగా నిలిచిపోయిన వాహనాలు, భారీ ట్రాఫిక్
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా జరిగే గరుడ సేవకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో తిరుమల గిరులు జనసంద్రంగా మారాయి. అంచనాలకు మించి భక్తులు పోటెత్తడంతో రద్దీని నియంత్రించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కొండపైకి ప్రైవేట్ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. 

అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా కూడా భక్తులు కాలినడకన పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమల క్షేత్రం మొత్తం గోవింద నామస్మరణతో మారుమోగుతోంది.

కొండపైకి చేరుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులను మాత్రమే ఆశ్రయించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో అలిపిరి వద్ద వేలాది వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తిరుపతిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడ సర్కిల్ వరకు ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఇప్పటికే పార్కింగ్ ప్రదేశాలన్నీ దాదాపు 4,000 వాహనాలతో నిండిపోయినట్లు సమాచారం.

మరోవైపు, గరుడ వాహనంపై శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకోవడంతో తిరుమాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. గ్యాలరీలు కిక్కిరిసిపోవడంతో భక్తులను మాడ వీధుల్లోకి అనుమతించడం లేదు. నందకం, రామ్ భగీచా, లేపాక్షి సర్కిళ్ల వరకు భక్తులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది.
Tirumala
Private Vehicles
Srivari Brahmotsavam
Alipiri
TTD

More Telugu News