Sandeep Kumar Jha: ప్రొటోకాల్ వివాదం.. సిరిసిల్ల కలెక్టర్‌ ఝాపై వేటు

Sandeep Kumar Jha Transfered After Protocol Controversy in Siricilla
  • సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక బదిలీ
  • ప్రభుత్వ కార్యక్రమానికి ఆలస్యంగా రావడమే కారణం
  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదుతో చర్యలు
  • ప్రాధాన్యం లేని పోస్టుకు కలెక్టర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం
  • కలెక్టర్‌తో పాటు మరో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ
  • సిరిసిల్లకు కొత్త కలెక్టర్‌గా ఎం. హరిత నియామకం
ప్రభుత్వ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కలెక్టర్‌తో పాటు పరిపాలనాపరమైన కారణాలతో మరో నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 17న సిరిసిల్లలో ‘ప్రజా పాలనా దినోత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కంటే కలెక్టర్ సందీప్ ఝా ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ ప్రొటోకాల్ ఉల్లంఘనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆది శ్రీనివాస్ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఎస్ ఇప్పటికే కలెక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయగా, తాజాగా ఆయనపై బదిలీ వేటు వేశారు.

సందీప్ ఝాను రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఈ పోస్టును ప్రాధాన్యం లేనిదిగా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన స్థానంలో విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం.హరితను సిరిసిల్ల కొత్త కలెక్టర్‌గా నియమించారు.

మరో నలుగురు ఐఏఎస్‌ల బదిలీ
ప్రభుత్వం చేపట్టిన ఈ బదిలీల్లో భాగంగా పలువురు కీలక అధికారుల శాఖలు మారాయి. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావును వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా బదిలీ చేసి, రవాణా శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వాణిజ్య పన్నుల, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీకి సాధారణ పరిపాలనా శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న సురేంద్ర మోహన్‌ను వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శిగా నియమించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కె. హరితను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
Sandeep Kumar Jha
Siricilla
IAS officers transfer
Adi Srinivas
Protocol violation
Telangana government
M Haritha
IAS transfers
Telangana politics
Public Administration Day

More Telugu News