Karur Stampede: విజయ్ సభలో తొక్కిసలాటపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి

CM Stalin shocked after stampede at Vijay rally in Karur
  • నటుడు విజయ్ కరూర్ సభలో తీవ్ర విషాదం
  • తొక్కిసలాట జరిగి 23 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం
  • మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు వార్తలు
  • ఘటనపై సీఎం స్టాలిన్ స్పందన
  • బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశం
  • సహాయక చర్యల కోసం మంత్రులను రంగంలోకి దించిన ప్రభుత్వం
 తమిళనాడులో ప్రముఖ నటుడు, 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన సభలో పెను విషాదం చోటుచేసుకుంది. కరూర్ లో శనివారం జరిగిన ఈ ర్యాలీలో అదుపుతప్పిన జనం కారణంగా తొక్కిసలాట జరిగి, చిన్నారులతో సహా 23 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే, కరూర్ లో జరిగిన సభలో విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో జనం ఊహించని రీతిలో పోటెత్తారు. దీంతో పరిస్థితి అదుపుతప్పి తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, చిన్నారులతో సహా చాలా మంది సొమ్మసిల్లి కిందపడిపోయారు. జనసందోహం ఎక్కువగా ఉండటంతో అంబులెన్సులు కూడా ఘటనా స్థలానికి చేరుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన విజయ్, తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేసి, వేదికపై నుంచి బాధితులకు నీళ్ల బాటిళ్లు అందించారు. "దయచేసి సహాయం చేయండి" అంటూ పోలీసులను కోరారు.

ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరూర్ నుంచి వస్తున్న వార్తలు తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు 'ఎక్స్'లో స్పందిస్తూ, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆరోగ్య శాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన పర్యవేక్షించాలని పొరుగు జిల్లా మంత్రి అన్బిల్ మహేశ్ కు కూడా సూచించినట్లు చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఏడీజీపీతో మాట్లాడినట్లు, ప్రజలందరూ వైద్యులు, పోలీసులకు సహకరించాలని స్టాలిన్ కోరారు.

ముఖ్యమంత్రి స్టాలిన్ రేపు కరూర్ ను సందర్శించే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఈ తొక్కిసలాట జరగడానికి ముందు విజయ్ తన ప్రసంగంలో డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Karur Stampede
Vijay
MK Stalin
TVK
DMK
Tamil Nadu

More Telugu News