Revanth Reddy: ఏటీసీ ట్రైనింగ్ తో జర్మనీలో నెలకు రూ. 3.50 లక్షల వేతనం తీసుకునే వారు ఉన్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy ATC Graduates Earning 3 Lakhs in Germany
  • సాఫ్ట్‌వేర్ కోర్సులతోనే విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయని అనుకోవద్దని వ్యాఖ్య
  • విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాలు అవసరమన్న ముఖ్యమంత్రి
  • అవసరమైన స్కిల్స్ యువతలో లేవని పరిశ్రమలు చెబుతున్నాయని వ్యాఖ్య
కేవలం సాఫ్ట్‌వేర్ కోర్సులతోనే విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయని భావించరాదని, ఏటీసీలో శిక్షణ పొంది జర్మనీలో నెలకు రూ. 3.50 లక్షల వేతనం పొందుతున్న వారు ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్లేపల్లి ఐటీసీ ప్రాంగణంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాలు కూడా అవసరమని ఆయన నొక్కి చెప్పారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడం కోసం టాటా టెక్నాలజీస్‌తో చర్చలు జరిపినట్లు తెలిపారు. వారి సహకారంతోనే ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఆటోమొబైల్ రంగంలో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, కానీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు యువతలో కొరవడ్డాయని ఆయన పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లభించడం లేదని పలు కంపెనీలు చెబుతున్నాయని అన్నారు.

రూ. 2,400 కోట్ల వ్యయంతో 65 ఏటీసీలను ఏర్పాటు చేశామని, ఒక్కో కేంద్రంలో సుమారు 200 మంది ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న వారందరికీ ఉద్యోగాలు లభిస్తున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో మరో 51 ఏటీసీలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందే విద్యార్థులకు ప్రతి నెల రూ. 2 వేల స్టైఫండ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. నిరుద్యోగుల పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, రాష్ట్రం ఏర్పడిన తరువాత పదేళ్లు గడిచినా యువత ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చదువు, సాంకేతిక నైపుణ్యం మాత్రమే మన భవిష్యత్తును మారుస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజుల్లో సాంకేతిక నైపుణ్యం తప్పనిసరి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గంజాయి కేసుల్లో అధికంగా ఇంజినీరింగ్ విద్యార్థులే పట్టుబడటం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. గంజాయికి బానిసలై విద్యార్థుల తల్లిదండ్రులకు బాధ కలిగించవద్దని హితవు పలికారు.
Revanth Reddy
Telangana
ATC
Advanced Technology Center
Germany jobs
Skills development
Tata Technologies
Unemployment
Engineering students
Ganja cases

More Telugu News