Khawaja Asif: మేం సైన్యంతో కలిసే పనిచేస్తాం.. అందులో తప్పేముంది?: పాక్ మంత్రి

Khawaja Asif Defends Pakistans Hybrid Governance Model
  • పాక్‌లో 'హైబ్రిడ్' పాలనను సమర్థించుకున్న రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్
  • అమెరికా పాలనా వ్యవస్థను 'డీప్ స్టేట్' అంటూ సంచలన వ్యాఖ్య
  • అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయంతోనే తీసుకుంటామని వెల్లడి
  • గత సైనిక పాలకుల వల్లే ఈ పరిస్థితి అంటూ వ్యాఖ్య
  • ఇటీవల పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్, తమ దేశంలోని పాలనా వ్యవస్థను గట్టిగా సమర్థించుకుంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ దేశంలో సైన్యం, పౌర ప్రభుత్వం కలిసి పనిచేసే 'హైబ్రిడ్ మోడల్' పాలనను సమర్థించారు. అంతేకాకుండా అమెరికా పాలనా వ్యవస్థను 'డీప్ స్టేట్' అంటూ విమర్శించడం గమనార్హం.

బ్రిటిష్-అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్‌తో జరిగిన ముఖాముఖిలో ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. "పాకిస్థాన్‌లో సైన్యం, పౌర నాయకులు అధికారాన్ని పంచుకుంటారు. కానీ అసలైన అధికారం సైన్యం చేతిలోనే ఉంటుంది కదా? రక్షణ మంత్రిగా మీరు ఆర్మీ చీఫ్‌కు జవాబుదారీగా ఉంటారు. మీ కంటే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ శక్తిమంతుడు కాదా?" అని మెహదీ హసన్ సూటిగా ప్రశ్నించారు.

ఈ వాదనను ఖ్వాజా అసిఫ్ తోసిపుచ్చారు. "అలా ఏమీ లేదు. నేను రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాడిని" అని ఆయన బదులిచ్చారు. అమెరికాలో రక్షణ మంత్రి అక్కడి సైనిక జనరల్స్‌ను తొలగించే అధికారం కలిగి ఉంటారని, కానీ పాకిస్థాన్‌లో ఆ పరిస్థితి లేదని జర్నలిస్ట్ గుర్తు చేయగా.. అసిఫ్ ఘాటుగా స్పందించారు. "అమెరికాలో భిన్నమైన వ్యవస్థ ఉంది. దానిని 'డీప్ స్టేట్' అంటారు" అని ఆయన వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్‌లో అధికారం ఎవరి చేతిలో ఉందని పదేపదే ప్రశ్నించగా తమది 'హైబ్రిడ్' వ్యవస్థ అని అసిఫ్ సమాధానమిచ్చారు. దేశంలో నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయంతోనే తీసుకుంటామని, ఒకరి మాటే చెల్లుబాటు కాదని ఆయన వివరించారు. దేశ ఆర్థిక, పాలనాపరమైన సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఈ హైబ్రిడ్ విధానం ఒక ఆచరణాత్మక అవసరమని ఆయన గతంలోనూ అభిప్రాయపడ్డారు. దేశంలో సైన్యం ప్రభావం ఎక్కువగా కనిపించడానికి గత సైనిక పాలకులే కారణమని ఆయన పేర్కొన్నారు.
Khawaja Asif
Pakistan
Pakistan government
Pakistan military
Hybrid model
Asim Munir
Deep state
Mehdi Hasan
Pakistan politics

More Telugu News