Nara Lokesh: ఆ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటాం: ఏపీ మంత్రి నారా లోకేశ్

Nara Lokesh vows action on irregularities in Sri Krishnadevaraya University
  • అనంతపురం ఎస్‌కేయూ‌లో అక్రమాలపై శాసనసభలో ప్రశ్నించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
  • విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని నియమించామన్న మంత్రి లోకేశ్
  • నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి    
అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్‌కేయు)లో 2019-24 మధ్య జరిగిన అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ విషయాన్ని ప్రకటించారు.

2019 – 24 కాలంలో ఎస్‌కేయూలో నిధుల దుర్వినియోగం జరిగిందనే విషయం వాస్తవమేనా? వారి బ్యాంకు ఖాతాలలో అందుబాటులో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల మొత్తం ఎంత? 2019 నుంచి 2024 మధ్య చట్టవిరుద్ధమైన పదోన్నతులు, సస్పెన్షన్లు జరిగాయనే విషయం కూడా వాస్తవమేనా..? ఆ వివరాలు ఏమిటని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు.

కంప్యూటర్ల కొనుగోలులో దుర్వినియోగం, విశ్వవిద్యాలయ వాహనాలను వ్యక్తిగత ఉపయోగానికి వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నియామకాలు, రిక్రూట్‌మెంట్‌లో రిజర్వేషన్ నిబంధనలు ఉల్లంఘించటం తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. రూ.153,01,33,628 నగదు బ్యాంకు ఖాతాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉన్నాయని తెలిపారు.

ఈ ఆరోపణలపై విశ్లేషణాత్మక విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని నియమిస్తామని, 100 రోజుల్లో నివేదిక ఇవ్వమని ఆదేశిస్తామని మంత్రి తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.

"ప్రజాప్రభుత్వం లక్ష్యం విశ్వవిద్యాలయాల పాలనను పారదర్శకంగా నడిపించడమే. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తే, వారిపై చర్యలు తప్పవు" అని మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. 
Nara Lokesh
Sri Krishnadevaraya University
SKU Anantapur
Andhra Pradesh
AP Assembly
Corruption allegations
Funds misappropriation
Illegal promotions
Fixed deposits

More Telugu News