Doolam Shekhar: కుమ్రం భీం జిల్లాలో దారుణం.. ఎలుగుబంటి దాడిలో దంపతుల మృతి

Bear Attack Kills Wife and Husband in Kumram Bheem
  • పశువులను మేపడానికి వెళ్లిన భార్యాభర్తల మృతి
  • సిర్పూర్(టి) మండలం పెద్దబండ అటవీ ప్రాంతంలో ఘటన
  • సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా మృతదేహాలను గుర్తించిన పోలీసులు
  • బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, ఉద్యోగం హామీ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశువులను మేపడానికి అడవికి వెళ్లిన దంపతులపై ఎలుగుబంటి దాడి చేయడంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సిర్పూర్‌ (టి) మండలం, అచ్చెల్లి గ్రామంలో గురువారం జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన దూలం శేఖర్‌ (45), ఆయన భార్య సుశీల (38) పశువుల కాపర్లుగా జీవనం సాగిస్తున్నారు. రోజూలాగే గురువారం కూడా తమ పశువులను మేపేందుకు సమీపంలోని పెద్దబండ అటవీ ప్రాంతానికి వెళ్లారు. సాయంత్రం పశువులు ఇంటికి తిరిగివచ్చినా శేఖర్ దంపతులు రాకపోవడంతో వారి పిల్లలు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే బంధువులకు తెలియజేశారు.

బంధువులు శేఖర్‌కు ఫోన్ చేయగా, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సీఐ సంతోష్‌, ఎస్సై సురేశ్‌ బృందాలు గ్రామస్థులతో కలిసి అడవిలో గాలింపు చేపట్టారు. రాత్రి 12 గంటల సమయంలో సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా వారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అక్కడికి చేరుకున్నారు. అక్కడ శేఖర్, సుశీల విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి చలించిపోయారు. వారి మృతదేహాలను సిర్పూర్‌(టి) ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

శుక్రవారం ఉదయం కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదోద్దీన్‌, డీఎఫ్‌వో సుశాంత్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారి శరీరాలపై ఉన్న గాయాల ఆధారంగా ఇది ఎలుగుబంటి దాడి అని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ దండె విఠల్‌, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఎఫ్‌డీవో సుశాంత్‌ హామీ ఇచ్చారు.
Doolam Shekhar
Kumram Bheem Asifabad
bear attack
Sirpur T
Achchelli village
couple death
forest
Telangana news

More Telugu News