Tej Pratap Yadav: బీహార్‌లో కీలక పరిణామం.. లాలూ ప్రసాద్ తనయుడు తేజ్ ప్రతాప్ కొత్త పార్టీ

Tej Pratap Yadav Announces New Party in Bihar
  • 'జనశక్తి జనతాదళ్'  పేరిట పార్టీని స్థాపిస్తున్నట్లు 'ఎక్స్' వేదికగా వెల్లడి
  • పార్టీ పోస్టర్‌లో గాంధీ, అంబేద్కర్, రామ్ మనోహర్, కర్పూరి ఠాకూర్ చిత్రాలు
  • 'సామాజిక న్యాయం, సామాజిక హక్కులు, సంపూర్ణ మార్పు' నినాదాలతో కొత్త పార్టీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. 'జనశక్తి జనతాదళ్' పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. బ్లాక్ బోర్డును పార్టీ గుర్తుగా పేర్కొన్నారు.

పార్టీ పోస్టర్‌లో మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, కర్పూరి ఠాకూర్ వంటి ప్రముఖ నాయకుల చిత్రాలను పొందుపరిచారు. 'సామాజిక న్యాయం, సామాజిక హక్కులు, సంపూర్ణ మార్పు' అనే నినాదాలను ఆ పోస్టర్‌లో ప్రచురించారు.

బీహార్ రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తామని, నూతన వ్యవస్థను పునాది నుంచి నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. బీహార్ సమగ్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక పోరాటానికి సంసిద్ధంగా ఉన్నామని ఆయన ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు.

కాగా, తేజ్ ప్రతాప్ యాదవ్‌ను లాలూ ప్రసాద్ యాదవ్ మే 25న పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. తన పెద్ద కుమారుడు వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించేలా ప్రవర్తిస్తూ, సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న సమష్టి పోరాటాన్ని బలహీనపరుస్తున్నాడని పేర్కొంటూ ఆయన ఈ చర్య తీసుకున్నారు.
Tej Pratap Yadav
Bihar
Janashakti Janata Dal
Lalu Prasad Yadav
Bihar Assembly Elections

More Telugu News