Shivadhar Reddy: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం

Shivadhar Reddy Appointed as New DGP of Telangana
  • డీజీపీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
  • రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందుకున్న శివధర్ రెడ్డి
  • అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్న శివధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన అక్టోబర్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.

హైదరాబాద్‌లో జన్మించిన శివధర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ గ్రామానికి చెందినవారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్‌లోనే అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 1994లో ఆయన ఐపీఎస్ సర్వీసులో చేరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏఎస్పీగా పలు జిల్లాల్లో పనిచేశారు. 2014-16 మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో నయీం ఎన్‌కౌంటర్‌ ఆపరేషన్‌ ఆయన హాయంలోనే జరిగినట్టు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్‌ కొసావోలో కూడా శివధర్ రెడ్డి పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా సేవలందించారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన తిరిగి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు.
Shivadhar Reddy
Telangana DGP
Telangana Police
Revanth Reddy
Telangana Government
Intelligence Chief

More Telugu News