Kishan Reddy: సింగరేణి సహా కోల్ ఇండియా కార్మికులకు రూ. 1,03,000 పనితీరు ఆధారిత ప్రోత్సాహకం

Kishan Reddy Announces 103000 Bonus for Coal India Singareni Workers
  • వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • మొత్తం 2.47 లక్షల మంది కార్మికులకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకం
  • మోదీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమ కోసం ఎన్నో చర్యలు తీసుకుందన్న కిషన్ రెడ్డి
సింగరేణి ఉద్యోగులకు కోల్ ఇండియా దసరా బోనస్‌ను ప్రకటించింది. ఉద్యోగుల పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థల్లోని 2.09 లక్షల మంది కార్మికులు, సింగరేణి కాలరీస్‌లోని 38,000 మంది కార్మికుల కృషికి గుర్తింపుగా ఒక్కొక్కరికి రూ. 1,03,000 చొప్పున పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు కిషన్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఇందులో ఉద్యోగుల బీమా కవరేజీని రూ. 1 కోటికి పెంచడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచామని తెలిపారు. ఉద్యోగులు ఎలాంటి బీమా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శాశ్వత ఉద్యోగులు కానివారికి కూడా బీమా రక్షణ కల్పించామని చెప్పారు.

తమ నిర్ణయాలు ఉద్యోగుల సమగ్ర సంక్షేమం వైపు ఒక ముందడుగు అని కిషన్ రెడ్డి అభివర్ణించారు. ఎక్స్‌గ్రేషియాను కూడా రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థలలో సీఎండీ నుంచి కార్మికుడి వరకు అందరికీ డ్రెస్ కోడ్ తీసుకువచ్చామని తెలిపారు. పండుగ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ఈ పనితీరు ప్రోత్సాహకం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనకు నిదర్శనమని అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, మార్గనిర్దేశనం తమకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. కోల్ ఇండియా పరివార్ భారతదేశం యొక్క బలాన్ని నిరూపించిందని ఆయన కొనియాడారు. కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన భవిష్యత్తును నిర్మించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ 'సంస్కరణ, పనితీరు, పరివర్తన' అనే మంత్రం బొగ్గు రంగాన్ని సరికొత్త సంకల్పంతో ముందుకు తీసుకు వెళ్లడానికి ఊతమిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Kishan Reddy
Coal India
Singareni Collieries
Dasara bonus
Performance Linked Reward
Coal workers

More Telugu News