Sonam Wangchuk: రాష్ట్ర హోదా కోసం లడఖ్‌లో అల్లర్లు.. సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టు

Sonam Wangchuk Arrested Amid Ladakh Statehood Protests
  • వాంగ్‌చుక్ ప్రకటనలతో లెహ్‌లో హింసాత్మక ఘటనలు జరిగాయన్న కేంద్రం
  • వాంగ్‌చుక్‌కు చెందిన 'ది స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్' రిజిస్ట్రేషన్ రద్దు
  • లడఖ్ ఆందోళనలకు తానే కారణమని కేంద్రం చెప్పడాన్ని ఖండించిన వాంగ్‌చుక్
లడఖ్ రాష్ట్రాన్ని సాధించేందుకు ఉద్యమిస్తున్న కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లడఖ్‌లో చోటుచేసుకున్న అల్లర్లకు కారకుడిగా సోనమ్‌ను పేర్కొంటున్నారు. యువతను ఆయన రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం వాంగ్‌చుక్ చేసిన ప్రకటనల వల్లే లెహ్‌ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఆయనపై బెయిలుకు అవకాశం లేని జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అభియోగాలు మోపారు. లడఖ్‌లో జరిగిన అల్లర్లలో నలుగురు మృతి చెందగా, సుమారు 90 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

వాంగ్‌చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఈ ఘర్షణలకు కారణమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 24 గంటలు గడవకముందే 'ది స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్' రిజిస్ట్రేషన్‌ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ఆ తర్వాత రోజే ఆయన అరెస్టు జరిగింది.

మరోవైపు, లడఖ్ ఆందోళనలకు తానే కారణమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొనడాన్ని వాంగ్‌చుక్ ఖండించారు. అసలు సమస్యను పక్కనపెట్టి తనను బలిపశువును చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం సమంజసమైన నిర్ణయం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Sonam Wangchuk
Ladakh
Ladakh protests
Statehood for Ladakh
Arrest
National Security Act

More Telugu News