Pakistan: భారత్ ఆతిథ్యమిచ్చే పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టోర్నీకి మేం వెళ్లడం లేదు!: పాకిస్థాన్

Pakistan not attending World Para Athletics Championship in India
  • ఈవెంట్‌ను పాకిస్థాన్ జాతీయ పారాలింపిక్ కమిటీ బహిష్కరించిందని కమిటీ ప్రధాన కార్యదర్శి వెల్లడి
  • ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, మేనేజర్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్య
  • ప్రస్తుత పరిస్థితుల కారణంగా జట్టును పంపించవద్దని ప్రభుత్వం సూచించినట్లు వెల్లడి
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, శనివారం నుంచి భారత్ ఆతిథ్యమివ్వనున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనకూడదని పాకిస్థాన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆ దేశ జాతీయ పారాలింపిక్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

భారతదేశంలో జరిగే ఈ కార్యక్రమాన్ని తమ జాతీయ పారాలింపిక్ కమిటీ బహిష్కరించిందని కమిటీ ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ జమిల్ షమీ మీడియాకు వెల్లడించారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు తమ బృందాన్ని పంపకూడదని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, మేనేజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా జట్టును పంపవద్దని తమ ప్రభుత్వం సూచించిందని ఆయన అన్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో రెండు క్రికెట్ జట్ల మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఢిల్లీ వేదికగా 2025 పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జరగనుంది.
Pakistan
World Para Athletics Championships
India Pakistan tensions
Para Athletics
Imran Jamil Shami

More Telugu News