AP Assembly: సభకు డుమ్మా కొడితే సీఎంకు తెలిసిపోతుంది.. ఏపీ అసెంబ్లీలో కొత్త అటెండెన్స్ విధానం

AP Assembly Introduces AI Facial Recognition Attendance for MLAs
  • ఏపీ అసెంబ్లీలో సభ్యుల హాజరుకు ఏఐ టెక్నాలజీ వినియోగం
  • ముఖాలను గుర్తించి ఆటోమేటిక్‌గా అటెండెన్స్ నమోదు
  • సభ్యుల హాజరు వివరాలు నేరుగా సీఎం డ్యాష్‌బోర్డుకు
  • పాత పద్ధతిలో రిజిస్టర్‌లో సంతకాలు చేసే విధానానికి స్వస్తి
  • ఎమ్మెల్యేలు సభకు డుమ్మా కొట్టకుండా ఉండేందుకే ఈ చర్యలు
  • ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో కొనసాగుతున్న కొత్త విధానం
ఏపీ శాసనసభలో ఇకపై సభ్యులు సభకు డుమ్మా కొట్టడం కుదరదు. హాజరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేసే ఫేషియల్ రికాగ్నిషన్ హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ విధానం ద్వారా సభలో సభ్యులు తమ సీట్లలో కూర్చోగానే, వారి ముఖాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా హాజరు నమోదవుతుంది. ఈ హాజరు నివేదిక నేరుగా సీఎం డ్యాష్‌బోర్డుకు చేరనుండటం గమనార్హం.

హైదరాబాద్‌కు చెందిన డ్యురాంక్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ప్రస్తుతం దీన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఈ టెక్నాలజీ కోసం సభలో ప్రత్యేకంగా పాన్, టిల్ట్, జూమ్ (పీటీజెడ్) కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ముందుగా ప్రతి సభ్యుడి ముఖానికి సంబంధించిన 175 వెక్టార్ పాయింట్లను కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. అనంతరం సభలో ఏర్పాటు చేసిన కెమెరా 180 డిగ్రీల కోణంలో తిరుగుతూ గంటకోసారి సభ్యుల ఫొటోలను తీసి సర్వర్‌కు పంపుతుంది. ఆ ఫొటోలను ముందుగా రికార్డ్ చేసిన డేటాతో సాఫ్ట్‌వేర్ పోల్చి, ఎవరు హాజరయ్యారు, ఎవరు గైర్హాజరయ్యారు అనే జాబితాను క్షణాల్లో సిద్ధం చేస్తుంది.

ఇప్పటివరకు సభ్యులు సభా ప్రాంగణం వెలుపల ఉన్న రిజిస్టర్‌లో సంతకాలు పెడుతున్నారు. అయితే, కొందరు సభ్యులు కేవలం సంతకం పెట్టి సభకు హాజరుకావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఎమ్మెల్యేలు ఇలాగే చేశారని విమర్శలు వచ్చాయి. 

ఇటీవల సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో సభలో కేవలం 50 మంది సభ్యులే ఉండటంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులంతా తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని, చర్చల్లో పాల్గొనాలని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పాత సంతకాల పద్ధతికి స్వస్తి పలికి, ఈ టెక్నాలజీ ఆధారిత హాజరు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలకు తప్పకుండా హాజరుకావాల్సి ఉంటుంది.
AP Assembly
Chandrababu
Andhra Pradesh Assembly
Facial Recognition
Attendance System
AI Attendance
GV Anjaneyulu
Duranik Technology Services
AP Politics
Assembly Sessions

More Telugu News