Saim Ayub: ఆసియాకప్‌లో నాలుగు డకౌట్లు.. సైమ్ అయూబ్‌ను పక్కన పెట్టాలన్న వకార్ యూనిస్

Waqar Younis Recommends Dropping Saim Ayub From Asia Cup Team
  • ఆసియా కప్‌లో అయూబ్ దారుణంగా విఫలం
  • అతడు పాక్ క్రికెట్ భవిష్యత్తు అయినప్పటికీ బ్రేక్ అవసరమన్న మాజీ
  • ఫామ్‌లేమితో అయూబ్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని వ్యాఖ్య
  • విషవలయంలో చిక్కుకున్న అతడికి విశ్రాంతి మేలు చేస్తుందని సూచన
  • అయూబ్ బాడీ లాంగ్వేజ్ చాలా పేలవంగా ఉందని విశ్లేషణ
పాకిస్థాన్ యువ క్రికెటర్ సైమ్ అయూబ్ విషయంలో ఆ జట్టు మాజీ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ కీలక సూచనలు చేశాడు. ఆసియా కప్‌లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్న అయూబ్‌కు కొంతకాలం విశ్రాంతినివ్వాలని, అతడిని తుది జట్టు నుంచి తప్పించాలని అభిప్రాయపడ్డాడు. అయూబ్ పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు అనడంలో సందేహం లేదని, కానీ ప్రస్తుత ఫామ్‌లేమి అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.

సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వకార్ యూనిస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "అతను ప్రతిభావంతుడు కాదని నేను అనడం లేదు. నిస్సందేహంగా అతను పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు. కానీ కొన్నిసార్లు ఫామ్ సరిగ్గా లేనప్పుడు, ఆటగాళ్లు ఒక విషవలయంలో చిక్కుకుపోతారు. మరింత కుంగిపోతారు. ఇప్పుడు అయూబ్ విషయంలో అదే జరుగుతోంది. అతడిని బెంచ్‌కే పరిమితం చేయాలని నేను గతంలోనే చెప్పాను" అని వకార్ వివరించాడు.

ప్రస్తుత ఆసియా కప్‌లో అయూబ్ బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లోనూ భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. మైదానంలోకి వచ్చినప్పుడు అతడి బాడీ లాంగ్వేజ్ కూడా చాలా పేలవంగా కనిపించిందని వకార్ పేర్కొన్నాడు. "అతడు ఒక యువకుడు. కొన్నిసార్లు అలాంటి ఆటగాళ్లను కాపాడటానికి, వారిని ఆడించకపోవడమే మంచిది" అని ఆయన సూచించాడు.

బ్యాటింగ్‌లో విఫలమవుతున్నప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం అయూబ్ రాణిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు వరకు ఆరు వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్ కెప్టెన్ జాకర్ అలీ, నురుల్ హసన్‌ల వికెట్లను తీసి సత్తా చాటాడు. అయినప్పటికీ, బ్యాటర్‌గా తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోవడంలో విఫలమవుతుండటంతో, అతడికి విశ్రాంతి అవసరమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
Saim Ayub
Waqar Younis
Asia Cup 2024
Pakistan Cricket
Pakistan vs Bangladesh
Cricket News
Saim Ayub Batting
Saim Ayub Bowling
Cricket Analysis
Pakistan Cricket Team

More Telugu News