Devineni Avinash: అసెంబ్లీలో చిరంజీవిని విమర్శిస్తున్నా జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారు: దేవినేని అవినాశ్

Devineni Avinash Demands Apology from Balakrishna
  • బసవతారకం ఆసుపత్రికి జగన్ ఎంతో చేశారన్న అవినాశ్
  • జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపాటు
  • జగన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్
అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బాలకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ డిమాండ్ చేశారు. విజయవాడలోని బాడవపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాశ్ మాట్లాడుతూ... "సభలో సభ్యత లేకుండా జగన్‌పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో బాలకృష్ణ కుటుంబానికి చెందిన బసవతారకం ఆసుపత్రికి ఎంతో సహకరించారు. ఆయన సినిమాలకు కూడా అండగా నిలిచారు. ఇంత మంచి చేసిన వ్యక్తిపై నోరు పారేసుకోవడం బాలకృష్ణ దిగజారుడుతనానికి నిదర్శనం" అని విమర్శించారు. గతంలో బెజవాడ సాక్షిగా ప్రధాని మోదీ తల్లిని దూషించి, తర్వాత ఆయన్నే కౌగిలించుకున్న వ్యక్తి బాలకృష్ణ అని ఆయన గుర్తుచేశారు.

సభలో ఏమాత్రం సంబంధం లేని సినీ నటుడు చిరంజీవిని కూడా బాలకృష్ణ విమర్శించారని అవినాశ్ మండిపడ్డారు. "చిరంజీవిని అంత మాట అన్నా, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం స్పందించలేదు. వారి బానిసత్వం ఏ స్థాయికి చేరిందో దీన్ని బట్టే అర్థమవుతోంది. నిండు సభలో చిరంజీవిని అవమానిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు?" అని జనసేన నేతలను సూటిగా ప్రశ్నించారు.

దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ తమకు దైవ సమానులని, కానీ బాలకృష్ణ వ్యాఖ్యలతో ఆయనపై ఉన్న గౌరవం పోయిందని అవినాశ్ అన్నారు. చంద్రబాబు తన హయాంలో ఏ ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టలేదని, కానీ జగన్ ఈ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘనతను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కూటమి ఎమ్మెల్యేలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Devineni Avinash
Balakrishna
Chiranjeevi
YS Jagan
TDP
YCP
Janasena
Andhra Pradesh Assembly
politics
Vijayawada

More Telugu News